Nene Raju Nene Mantri Theatrical Trailerతేజ దర్శకత్వం వహించే సినిమాలు ఎలా ఉంటాయి? క్లుప్తంగా చెప్పాలంటే… హీరోయిజం అంటే ఏంటో తెలియని హీరో… విలనిజం అద్భుతంగా మాత్రం పండించే విలన్… ఇది చూడలేక ప్రేక్షకులు తలలు పట్టుకోవడం… ఇది గత కొన్నేళ్ళుగా తేజ దర్శకత్వం వహించే సినిమా కధలు. మొదట్లో కాస్త కొత్తగా ఉందని ఆదరించడంతో, అదే రూట్ లో పయనించిన తేజకు కావాల్సినన్ని చేదు అనుభవాలను ప్రేక్షకులు మిగిల్చారు. దీంతో ‘సక్సెస్’ అన్న మాట తేజకు ఓ ‘కల’గా మారింది.

కానీ తాజాగా తేజ దర్శకత్వం వహిస్తున్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమా విషయంలో మాత్రం మారినట్లుగా కనపడుతున్నారు. ఫస్ట్ టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ, ట్రైలర్ తో ఏకంగా బుట్టలో పడేసాడని చెప్పవచ్చు. అవును… రానా, కాజల్ జంటగా నటించిన “నేనే రాజు నేనే మంత్రి” ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఇటీవల కాలంలో పొలిటికల్ సబ్జెక్ట్స్ ను ఎవరూ టచ్ చేయకపోవడంతో, దానిని ఎంచుకుని తనలోని కొత్తదనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతోంది.

జోగేంద్రగా రానా పర్ ఫెక్ట్ అనిపించే విధంగా కనపడుతున్నాడు. ఈ సారి రానాలోనే హీరోయిజాన్ని, విలనిజాన్ని తేజ పండించినట్లుగా తెలుస్తోంది. అనూప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సన్నివేశానికి అనుగుణంగా వచ్చే “ఈ కటౌట్ కు గజమాల పడే టైం వచ్చేసింది, లెక్కేసి కొడితే అయిదేళ్ళల్లో సిఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి, వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి స్టార్ హోటల్ లో పెడితే నేను అవుతా…. సిఎం.., పాముకు పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి…” వంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లాప్ లలో ఉన్న తేజ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేం. చూడబోతుంటే… తనలో ఉన్న కసినంతా ఈ సినిమాలో పెట్టి గట్టిగా కొట్టబోతున్నాడనే సంకేతాలు కనపడుతున్నాయి. మరో వైపు ‘బాహుబలి 2’ తర్వాత పూర్తి విరుద్ధంగా పొలిటికల్ యాంగిల్ లో రానా కనిపించడం అనేది, అతని విలక్షణతకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆగష్టు 11వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.