NENE RAJU NENE MANTRI satire on political partiesతేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేయడంలో దర్శకుడు తేజ సక్సెస్ సాధించినట్లే కనపడుతోంది. ఒక పార్టీ, మరో పార్టీ అన్న తారతమ్యం లేకుండా అన్ని పార్టీలకు వర్తించే విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించి ప్రేక్షకుల చేత ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. ఒక రకంగా రాజకీయ నాయకుల పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయాలను రానా డైలాగ్స్ ద్వారా వెండితెరపై ప్రతిబింబించారని చెప్పవచ్చు.

ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చిన డైలాగ్స్… 70 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీలో మేమే ఉంటాం… ఒక సినిమా దేవుడు వచ్చి పార్టీ పెట్టి గెలుస్తారు అనుకుంటే దానిలోనూ మేమే చేరతాం… ఒక మాస్ హీరో పార్టీ పెట్టి గెలుస్తాడు అనుకుంటే అందులోనూ మేమే చేరతాం… లేదా ఒక ఉద్యమకారుడు వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులో కూడా మేమే చేరతాం… జనం మమ్మల్ని కాదని ఓట్లు వేసినా, ఆ పార్టీ గెలిచిన తర్వాత ఏదొకటి చేసి అందులోనూ మేమే చేరతాం… జనం ఏ పార్టీకి ఓట్లు వేసినా అధికారంలో మేమే ఉంటాం… అంటూ వర్తమాన రాజకీయాల జంపింగ్ లపై డైలాగ్స్ సంధించాడు.

వారసత్వ రాజకీయాలను ప్రస్తావిస్తూ వేసిన సెటైర్లు… ఈ కన్నీటి యాత్రలు, బుగ్గలు గిల్లడాలు, ముద్దులు పెట్టడాలు వీడు బాగా అలవాటు చేసుకున్నాడు… రాజకీయాలకు రిటైర్మెంట్ ఏజ్ లేదు కాబట్టి… నీ లాంటి ముసలోళ్ళు ప్రతి పార్టీ ఉండి దొబ్బెస్తున్నారురా… ఇక మీరు గెలవాలని పూజలు, యాగాలు మొదలుపెట్టండి… అన్న డైలాగ్స్ దియేటర్లో బాగా పేలుతున్నాయి. అయితే ఒక పార్టీని ఉద్దేశించి కాకుండా మొత్తం రాజకీయ వ్యవస్థపైనే పంచ్ లు పేలడంతో, దీనిని ఏ ఒక్క పార్టీ కూడా నెత్తిన పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. ఓవరాల్ గా ‘తల్లి – పిల్ల’పై వేసిన డైలాగ్స్ బాగా కనెక్ట్ అయినట్లు కనపడుతోంది.