Rana 'Nene Raju Nene Mantri' Deal, Yet to Be Lockedవిలక్షణ సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుకుంటున్న దగ్గుపాటి రానా, ఈ నెల 11న విడుదల కాబోతున్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమాతో స్టార్ హీరోల జాబితాలోకి వెళ్ళిపోవడం ఖాయం అంటున్నారు దర్శకుడు తేజ. అంతేకాదు హీరోయిన్ కాజల్ కు, సినిమాటోగ్రాఫర్ కు మరియు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు కూడా మంచి పేరొస్తుంది అంటూ బల్లగుద్ది చెప్తున్నారు తేజ.

అంతకుముందు సినిమాలలో కధాబలం లేకపోవడం వలనే ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చిందని, అది ఈ సినిమాతో కరెక్ట్ చేసుకున్నానని చెప్పిన తేజ, ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత గతంలో నన్ను చూసి ముఖం పక్కకు తిప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నారని తెలిపారు. నా తొలి సినిమా ‘చిత్రం’ ఎలాగైతే అంతకుముందు ఉన్న బౌండరీలను తొలగించిందో, ఈ సినిమా కూడా అలాగే చేస్తుందని అన్నారు.

కధ పరంగా అయితే కొత్తగా ఉండదు గానీ, కధనం మాత్రం కొత్తగా ఉంటుందని, సహజత్వానికి దగ్గరగా ఉంటుందని తెలిపారు. రానా పోషించిన పాత్ర నెగటివ్ కాదు గానీ, ఒక మనిషిలో ఉండే మంచి, చెడు రెండింటిని చూపించామని, ఒక రకంగా నిజ జీవితంలో మనిషి ఎలా ఉంటాడో… జోగేంద్ర కూడా అలాగే ఉంటాడని అన్నారు. ఇంత విశ్వాసం వ్యక్తం చేస్తున్న తేజ, ఈ సినిమా విడుదల తర్వాత తన స్థాయి ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు.