nene raju nene mantri lie jaya janaki nayakaఅగ్ర హీరోల సినిమాలు విడుదల కాకపోయినా, బాక్సాఫీస్ వద్ద అంతకుమించిన సందడి వాతావరణాన్ని సృష్టించడంలో “నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై” సినిమాలు సక్సెస్ అయ్యాయి. విశేషం ఏమిటంటే… ఈ మూడు సినిమాలు మూడు జోనర్స్ కు చెందినవి కావడంతో, సినీ ప్రేక్షకులకు ఛాయిస్ లభించినట్లయ్యింది. మరి ఈ ముగ్గురిలో ‘విన్నర్’ ఎవరు? ఈ పూర్తి సమాచారం తెలియాలంటే మరో రెండు రోజులు వేచిచూడాలేమో గానీ, సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటికే పడిన షోల రీత్యా తొలి టాక్ వచ్చేసింది.

ముందుగా… తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాకు ప్రేక్షకుల నుండి ‘డివైడ్’ టాక్ వ్యక్తం కావడం విశేషం. ఈ మూడు సినిమాలలోనూ పబ్లిసిటీ పరంగానే కాక, ప్రేక్షకులలోనూ బజ్ ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా ఆశించిన అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే ‘ఫస్ట్ టాక్’ వెలువడింది. తేజ చిత్రాలకు సహజంగా భారీ నెగటివ్ టాక్ ఉంటుంది. ఈ సినిమాకు అంత కాకపోయినా… అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే చిత్రంగా లేదన్నది టాక్. సింపుల్ గా చెప్పాలంటే… రానా ‘వన్ మ్యాన్ షో’ అన్నది ఫైనల్ గా డిక్లేర్ చేసిన విషయం.

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి, మరోసారి తన మార్క్ ను “జయ జానకి నాయక” సినిమా ద్వారా నిరూపించుకున్నట్లుగా కనపడుతోంది. బహుశా ఇదే సినిమా ఏ అగ్ర హీరోకో పడితే, దీని రేంజ్ వేరు అనే విధంగా టాక్ ఉంది. కధ పరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు గానీ, హీరోయిజంతో కూడిన ఫైట్లు, ఫ్యామిలీ ఏమోషన్స్ తో ప్రేక్షకులను నిరుత్సాహపరచలేదు అన్న టాక్ అయితే వ్యక్తమవుతోంది. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హావభావాలను పలికించలేకపోయారు గానీ, బోయపాటి మాత్రం న్యాయం చేసారు అన్న టాక్ ను ‘జయ జానకి నాయక’ కైవసం చేసుకున్నట్లుగా కనపడుతోంది.

‘మైండ్ గేమ్’తో కూడిన సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంటాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ నటించిన “లై” సినిమా కూడా అలాంటిదే. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆసక్తికి తగ్గట్టుగా లేదన్న టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘మైండ్ గేమ్’ జోనర్ అనేది లిమిటెడ్ కావడం, పోటీగా మరో రెండు సినిమాలు ఉండడంతో, ‘లై’ ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి. ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమా తర్వాత 14రీల్స్ సంస్థలో హను రాఘవపూడి వరుసగా చేసిన రెండవ సినిమా ఇది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం, రిచ్ నెస్ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్.

మొత్తమ్మీద రాజకీయ కధతో వచ్చిన రానా సినిమా పబ్లిసిటీ పరంగా లీడ్ లో ఉండగా, సేఫ్ గేమ్ ఆడుతూ రొటీన్ మాస్ మూవీగా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ టాక్ పరంగా లీడ్ లో ఉంది. ఇక ఓపెనింగ్స్ పరంగా అయితే రానా “నేనే రాజు నేనే మంత్రి” సినిమా అగ్ర స్థానంలో నిలువగా, నితిన్ “లై” సినిమా రెండవ స్థానంలో ఉంది. బోయపాటి బ్రాండ్ తో విడుదల అవుతోన్న ‘జయ జానకి నాయక’ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ లభించాయనేది ట్రేడ్ టాక్. ఇది ప్రాధమిక సమాచారం మేరకు టాక్ లో బోయపాటి సినిమా లీడ్ లో ఉండగా, ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలుస్తారో, దక్కిన ఓపెనింగ్స్ ను ఎవరు నిలబెట్టుకుంటారో రానున్న రెండు రోజుల్లో తేలనుంది.