Nene Raju Nene Mantri Jogendra Yuvagarjanaరొటీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి చూసి విసిగి వేసారిపోయిన సినీ ప్రేక్షకులకు, ‘జోగేంద్ర యువగర్జన’ పేరుతో నిర్వహించిన సినీ వేడుక ఆహ్లాదకరమైన ఆనందాన్ని పంచింది. యాంకర్ల ఓవర్ డైలాగ్ లు… ఆహ్వానితుల వివాదపు వ్యాఖ్యలు… హీరోల భజన కార్యక్రమాలు… తదితర అంశాలకు దూరంగా, ఆగష్టు 11వ తేదీన విడుదల కాబోతున్న “నేనే రాజు నేనే మంత్రి” సినీ వేడుక జరిగింది. మరో విశేషం ఏమిటంటే… ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న హీరో నవదీప్ ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం.

ఈ వేడుకలో బాగా హైలైట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే… అది బిత్తిరి సత్తి అనే చెప్పాలి. తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో స్టేజ్ పైకి వచ్చిన వారికి ప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టి, తద్వారా ప్రేక్షకులను నవ్వించడంలో బిత్తిరి సత్తి సూపర్ సక్సెస్ సాధించాడు. ఆ మాటకొస్తే, ఒక్క ప్రేక్షకులే కాదు, స్టేజ్ పైన ఉన్న వారు కూడా బిత్తిరి సత్తి అడిగిన విధానంతో, అడుగుతున్న ప్రశ్నలతో హాయిగా నవ్వుకున్నారు. నిజానికి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సినీ వేడుక చూసి చాలా కాలమే అయ్యిందని చెప్పాలి.

ఈ వేడుకలో ప్రసంగించడానికి ‘నో’ చెప్పిన దర్శకుడు తేజ చేత మాట్లాడించడానికి హీరో రానా చేసిన ప్రయత్నం వీక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ముక్తసరిగా కార్యకర్త మాదిరి రెండు ముక్కలు మాట్లాడారు గానీ, రానా మాత్రం రాజకీయ నాయకుడి మాదిరి కాసేపు బాగానే ప్రసంగించారు. రానా – తేజలు కలిసి చేసిన ఓ వినూత్న ప్రయత్నంగా అభివర్ణించిన “నేనే రాజు నేనే మంత్రి” ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసం… మొత్తంగా చిత్ర యూనిట్ సభ్యులలో స్పష్టంగా కనపడింది. ఇక తుది తీర్పు ప్రేక్షకుల నుండి రావాల్సిందే..!