Rana Daggubati & Venkatesh Met Rajiv Gandhi Murder Investigator“నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా… క్లైమాక్స్ లో వచ్చే ‘జోగేంద్ర… జోగేంద్ర…’ అన్న పాట వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జోగేంద్రను ఊరి తీయవద్దు అంటూ ప్రజలంతా పాడిన ఈ పాట ‘ఫ్లాష్ బ్యాక్’ వింటే అవాక్కవ్వాల్సిందే. నిజానికి ఈ పాటను విక్టరీ వెంకటేష్ తో తీయాలనుకున్న సినిమా కోసం ఏడేళ్ళ క్రితం రికార్డు చేయించానని, అయితే అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ దగ్గరికే వచ్చిందని… ఈ సినిమా సక్సెస్ మీట్ లో తేజ అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాకు మొదటి ప్రేక్షకుడు కూడా వెంకటేష్ గారేనని, ఒకరోజు తనను పిలిచి షో వేయమని అడిగారని, ఆ తర్వాత ఒక చోట సలహా చెప్పారని, బాగానే ఉందని మార్పులు చేసామని, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు ఫోన్ చేసి ‘మా రానాకు మంచి హిట్ ఇస్తున్నావు’ అన్నారని వెంకీ మాటలను గుర్తు చేసుకున్నారు. భయపెడుతూ, పోగుడుతూ, బెదిరిస్తూ చిత్ర బృందం నుండి పని చేయించుకున్నానని డైలాగ్స్ రచయిత లక్ష్మీభూపాల్ గురించి ప్రస్తావిస్తూ నవ్వులు పూయించారు.

ఫైనల్ గా… ఈ సినిమాతో తానూ కూడా ఒక హిట్టు సినిమా తీయగలనని ప్రేక్షకులు సర్టిఫికేట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నానని, ఇక మున్ముందు కూడా హిట్టు సినిమాలను తీయాలనుకుంటున్నానని ఛలోక్తులు విసిరారు తేజ. ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉందో తేజ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనపడుతోంది. చాలా సంవత్సరాల తర్వాత లభించిన హిట్టుతో మాంచి ఎంజాయ్ మెంట్ మూడ్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ ఉన్నట్లుగా కనపడుతోంది. ఈ సినిమాకు ఇన్ని డబ్బులు వస్తాయని తాను కూడా ఊహించలేదని ఇదే వేదికపై రానా కూడా అన్నారు.