Nellore YSR Congressగత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో నెల్లూరు జిల్లాలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కనుక ఇక నెల్లూరు వైసీపీ కంచుకోటగా మారిపోయిందనుకొంటే, ఇప్పుడు వైసీపీ నేతల మద్య ఆధిపత్యపోరుతో ఆ కంచుకోట బీటలువారిపోతోంది. ముందుగా ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల పార్టీ అధిష్టానం మీద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాజీ మంత్రిగా మారిన అనిల్ కుమార్‌ తనకి ఈ పరిస్థితి కల్పించినందుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వారిరువురికీ మద్య నెల్లూరులో ఆదిపత్యపోరు కొనసాగుతుంటే తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చి చేరారు.

తన నియోజకవర్గంలో ఆసరా పెన్షన్లు కత్తిరిస్తున్నందుకు ఇప్పటికే ఆయన ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో సిఎం జగన్‌ ఆయనని బుజ్జగించి పంపారు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాలలో చిరకాలంగా చక్రం తిప్పుతున్న మేకపాటి, ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబాలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

ఇటీవల తన నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను పార్టీ జెండా మోసి అట్టడుగుస్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకొన్నాను తప్ప నాకు ఎటువంటి పోలిటికల్ బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేవు. కానీ నాకు అవకాశం వచ్చిన ప్రతీసారి ఆనం, మేకపాటి కుటుంబాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. జిల్లాలో వారి కుటుంబాలవారిని తప్ప మరెవరినీ ఎదగనీయరా?అట్టడుగుస్థాయి నుంచి ఎన్నో పోరాటాలు చేసి వచ్చిన నేను, అవసరమైతే వారిని కూడా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను. ఇకపై ఎట్టి పరిస్థితులలో టికెట్లు, పదవులు అన్నిటిలో నాకు న్యాయంగా రావాల్సిన వాటాని సాధించుకొంటాను. వాటి కోసం అవసరమైతే వారితో పోరాడైనా సాధించుకొంటాను తప్ప తెగ్గేదేలే. అయితే నేను వారిలాంటి వ్యక్తిని కాను. నాతో పాటు మీ అందరూ కూడా సమానంగా ఎదగాలని కోరుకొంటున్నాను. మీ కోసం నేను ఎవరినైనా ఎదిరించి పోరాడాటానికి సిద్దంగా ఉన్నాను,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.