Nela-Ticket-Trailer-Talk-Extremely-Routine-And-Messy‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో కళ్యాణ్ కృష్ణ ప్రామిసింగ్ డైరెక్టర్ గా కనిపించాడు. కమర్షియల్ + కొత్తదనంతో కూడిన ఎంటర్టైన్మెంట్ ను అందించి సక్సెస్ అందుకున్న తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి ఫ్యామిలీ మూవీని అందించాడు. ఈ రెండు జోనర్స్ అయిపోయాయి, ఇక ఫుల్ మాస్ జోనర్ లో తన టాలెంట్ ను చూపించుకోవాలనుకున్నారో ఏమో గానీ, లేటెస్ట్ “నేలటికెట్టు” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో పక్కా మాస్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి గానీ, అవి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడం నిరుత్సాహ పరిచే అంశం. రెగ్యులర్ రవితేజ నుండి ఇలాంటి సినిమాలు, ఈ తరహా నటనను ప్రేక్షకులు చూసి చూసి బోర్ కొట్టేసి ఉన్నారు. కానీ మళ్ళీ అదే తరహా నటనతో రవితేజ – కళ్యాణ్ కృష్ణ రాబోతుండడం, ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో వేచిచూడాలి. సూపర్ సక్సెస్ తో మొదలైన మొదటి సినిమా నుండి మూడవ సినిమాకు వచ్చేసరికి గ్రాఫ్ డౌన్ అయ్యే విధంగా ఉండడం, కళ్యాణ్ కెరీర్ కు మైనస్ పాయింట్.

గత రెండు దశాబ్దాలుగా రవితేజ ఇలాగే చేస్తున్నారు, మధ్యలో ఒకటి, అర మినహాయిస్తే 90 శాతం చిత్రాలలో ఇదే తరహా నటనను ప్రదర్శించారు. కాబట్టి రవితేజ నుండి అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం పెద్దగా ఆశించడం లేదు. కానీ దర్శకులపై ఉన్న నమ్మకంతో తమ అభిమాన హీరోను కొత్తగా చూపిస్తారేమోనని ఆశలు పెట్టుకుంటుండగా, అలాంటి వారికి ఆశాభంగం కలుగుతోంది. సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్మెంట్ పండితే, ఎంత రొటీన్ అయినా పాస్ మార్కులు వేస్తారనే సేఫ్ జోన్ ఆలోచనలే ఇలాంటి సినిమాల రూపకల్పనకు కారణాలు.