Nela Ticket Movie Teaserప్రస్తుతం సక్సెస్ ల ఆనందంలో ఉన్న టాలీవుడ్ ఊపును కొనసాగించేందుకు ప్రతి వారం ఏదొక ప్రతిష్టాత్మక సినిమా విడుదల కానుంది. అందులో ప్రధానంగా మాస్ మహారాజా రవితేజ నటించిన “నేల టికెట్టు” సినిమా కూడా ఉంది. ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో పెద్దగా అంచనాలేవీ లేవు. టైటిల్ కు తగ్గట్లుగా కేవలం మాస్ వర్గాలకే పరిమితమయ్యే విధంగా ఉన్న టీజర్ కు అన్ని వర్గాల నుండి ఆదరణ లేకపోగా, ఇటీవల విడుదలైన పాటలు కూడా నిరాశపరిచాయి.

ఆడియోతో పాటు వీడియో ప్రోమోలు కూడా అంతంతమాత్రమే ఉండడంతో “నేల టికెట్టు”పై ప్రేక్షకుల ఆసక్తి కరువయ్యింది. అయితే ఈ నెల 16వ తేదీన విడుదల కాబోయే ట్రైలర్ సినిమా ఓపెనింగ్స్ ను డిసైడ్ చేయనుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పైనే మాస్ మహారాజా రవితేజ అభిమానుల ఆశలన్నీ పెట్టుకున్నారు. మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ కాగా, రెండవ సినిమా యావరేజ్ తో సరిపెట్టిన కళ్యాణ్ కృష్ణ, మూడవ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.