అందం, అభినయంతో ఆకట్టుకుంటూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న మలయాళ ముద్దుగుమ్మ నయనతార రాజకీయ రంగం ప్రవేశం చేయనుందా? అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి నయన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు, అతి త్వరలోనే ఆమె అధికార పార్టీలో చేరనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సాధారణంగా సినీ ప్రమోషన్లకు నయనతార హాజరుకాదు, దర్శకనిర్మాతలకు ముందే ఈ విషయాన్ని చెప్పేస్తారు. నటించడం వరకే తన పని అని, మిగతాది దర్శక నిర్మాతలు చూసుకోవాల్సిందేననే భావన కలిగిన నయనతార మనస్తత్వంలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల అధికార పార్టీ నిర్వహించిన స్పోర్ట్స్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి నయనతార ముఖ్య అతిథిగా పాల్గొని హాట్ హాట్ చర్చలకు తెరలేపారు.
ఒక హీరోయిన్ మాదిరి కాకుండా ఓ సాధారణ మహిళలా ఆ కార్యక్రమానికి ఈ ముద్దుగుమ్మ హాజరు కావడంతో అసలు విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఇదే ఆమె రాజకీయరంగ ప్రవేశంపై చర్చలకు తెరలేపుతూ… అధికార పార్టీలో చేరడం ఖాయమనేది సినీ జనాల భోగట్టా. అయితే ఈ విషయంలో నయనతార ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లో చేరడం కొత్తేమీ కాదు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ పోకడ మరింత ఎక్కువన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఇదే కోవలోకి అడుగులు పడుతున్న ఈ మలయాళీ చిన్నది రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. ఇటీవల తమిళనాట జరిగిన ఎన్నికల సందర్భంగా నటి నమిత అన్నాడీఎంకేలో చేరిన సంగతి తెలిసిందే. అలాగే మరో నటి రమ్య కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన విషయమూ తెలిసిందే. మరి నయన ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.