NAWAB -Trailer- Talkమణిరత్నం సినిమాలు అంటే స్లోగా, సాగదీసే విధంగా ఉంటాయని భావించిన వారికి “నవాబ్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ సరికొత్త సమాధానం ఇస్తోంది. దాదాపుగా రెండు నిముషాల 45 సెకన్ల పాటు సాగిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక్కో క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ రేసీగా ఉండడంతో, విమర్శలకు మణి బదులిచ్చినట్లయ్యింది.

సినిమా కధ విషయానికి వచ్చేపాటికి భూపతిరెడ్డి ఫ్యామిలీ స్టోరీగా కనపడుతోంది. భూపతిరెడ్డిగా ప్రకాష్ రాజ్ కనిపించగా, కొడుకులుగా అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబులు నటించారు. అలాగే కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించాడు. మణి కధలు ఎప్పుడూ రామాయణ, మహాభారతాల నుండే ఎంపిక చేసుకుంటారనే విమర్శ ఉండగా, ఈ కధ కూడా అందుకు తావిచ్చేదిలానే కనపడుతోంది.

ఈ సినిమాలో హీరోలు, విలన్లుగా అంతా రెడ్డి ఫ్యామిలీలోనే ఉన్నట్లుగా చూపించారు. మొత్తమ్మీద మణి ఈజ్ బ్యాక్ అనిపించే విధంగా ట్రైలర్ అంచనాలను అందుకుంది. ప్రకాష్ రాజ్ కు జతగా జయసుధ నటించగా, హీరోయిన్ల జాబితాలో జ్యోతిక, అదితిరావు, ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. సాంకేతిక విభాగంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్.