navdeep-on-jr-ntr-baadshah-movieసినిమా హిట్టయితే ఒక మాట, ఫట్ అయితే మరొక మాట చెప్పడం సినీ జనాలకు కొత్తేమీ కాదు. అందులో భాగంగానే వర్ధమాన హీరో నవదీప్ కూడా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘బాద్ షా’ చిత్రంలో విలన్ పాత్రలో నవదీప్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చేసి ఉండాల్సింది కాదు అని తాజాగా నవదీప్ చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో సంచలనాత్మకంగా మారాయి.

ఈ సినిమా స్క్రిప్ట్ విన్నపుడు తన క్యారెక్టర్ బాగా వర్కౌట్ అవుతుందని భావించానని, కానీ సినిమా చూసిన తర్వాత నిరుత్సాహపడి, అనవసరంగా చేశాననే అనుభూతికి లోనయ్యానని, అనుకున్న స్థాయిలో తన పాత్ర రాలేదని అన్నాడు. ఈ సినిమా కంటే ‘ఆర్య 2’లో చేసిన నెగటివ్ క్యారెక్టర్ కే తనకు ఎక్కువ పేరొచ్చిందని, ‘బాద్ షా’ లాంటి పాత్రల కంటే ‘ఆర్య 2’ లాంటి క్యారెక్టర్లే ఉత్తమమని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే నవదీప్ ‘బాద్ షా’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి ఉంటే, ఇవే డైలాగ్స్ వేసేవాడా… అంటున్నారు నెటిజన్లు.