National Green Tribunal imposed 250cr on AP Governmentవైసీపీ హయాంలో ఏదైనా మంచి జరిగితే అది తమ ప్రభుత్వం లేదా తమ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో జమా చేసుకొని భుజాలు చరుచుకోవడం, తప్పులు జరిగితే గత టిడిపి ప్రభుత్వం నెత్తిన రుద్దేయడం పరిపాటే. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయలేక టిడిపిని నిందిస్తూ మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. తాజాగా టిడిపి ఖాతాలో జమా చేయడానికి మరో మూడు సమస్యలు వచ్చాయి.

పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.250 కోట్ల జరిమానాలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. కానీ సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

ఈరోజు ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, పర్యావరణ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే వాటిలో ఎటువంటి మినహాయింపులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయితే రూ.250 కోట్ల జరిమానా చెల్లింపుపై తదుపరి విచారణలో నిర్ణయం చెపుతామనడమే వైసీపీ ప్రభుత్వానికి చాలా ఊరట కలిగించే అంశం. కానీ ఆ సొమ్మును తదుపరి విచారణ తర్వాత అయినా జమా చేయవలసి ఉంటుందని సూచించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఏపీ ప్రభుత్వానికి పట్టిసీమలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.1.90 కోట్లు, పురుషోత్తపట్నంలో ఉల్లంఘనలకు రూ.2.48 కోట్లు, మిగిలిన సొమ్మును పోలవరం ప్రాజెక్టులో ఉల్లంఘనలకు జరిమానాలుగా విధించింది. గతంలో ఇదే కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే బదులు అదేదో గ్రీన్ ట్రిబ్యూనల్ సూచానల ప్రకారం పర్యావరణం కొరకు ఖర్చు చేయవచ్చు కదా? అలా చేస్తే ఈ న్యాయపోరాటాలు అవసరమే లేదు కదా? ఇటువంటి న్యాయపోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో తెలుసుకోవాలనుకొంటున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు.

అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ఈ సమస్య ఉత్పన్నం అయ్యిందని నేడో రేపో మంత్రులు, వైసీపీ ఆత్మసాక్షి చెప్పడం ఖాయమే. కనుక దానికి జవాబు చెప్పడానికి బహుశః టిడిపి, మీడియా కూడా సిద్దంగానే ఉండి ఉండవచ్చు.