National Commission for Women Chairman rekha sharma responds to amaravati women farmersరాజధాని పోరాటం సందర్భంగా మహిళా రైతుల మీద పోలీసులు వ్యవహరించిన తీరు మీద అన్నివైపులా నుండీ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఒక నిజనిర్ధారణ కమిటిని అమరావతి పంపించారు.

మహిళలపై లాఠీ ఛార్జి, దాడి ఘటనలకు సంబంధించి తుళ్లూరు తహసీల్దార్‌, డీఎస్పీతో ..కమిషన్‌ సభ్యులు కాంచన కట్టర్‌, ప్రవీణ్‌ సింగ్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుళ్లూరు గ్రామానికి చేరుకునే ముందు మార్గ మధ్యంలో మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను మహిళా కమిషన్‌ సభ్యులకు వివరించేందుకు తుళ్లూరు మహిళలు భారీగా తరలివచ్చారు.

పోలీసులు తమను ఏవిధంగా హింసించిందీ మహిళలు కమిషన్‌ ఎదుట ఏకరువు పెట్టారు. దాడి ఘటనకు సంబంధించి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన కొన్ని దృశ్యాలను కమిషన్‌ సభ్యులకు చూపించారు. ఇది ఇలా ఉండగా మహిళలు నిజనిర్ధారణ కమిటి సభ్యులను కలవకుండా పోలీసులు నిలువరిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు రంగంలోకి దిగి మహిళలను వారి వద్దకు తీసుకుని వెళ్తున్నారు.

ఈ విషయంలో పోలీసులపై ప్రతికూల రిపోర్టు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదే నిజమైతే పోలీసు శాఖకు ఇబ్బందే అని చెప్పుకోవాలి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖ శర్మ నిజనిర్ధారణ కమిటి రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నా అని, ఆ తరువాత ఏం చెయ్యాలి అనేది చూస్తా అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.