National Anthem in Theatres - Inox Hyderabadహైదరాబాద్ లోని ‘ఐనాక్స్’ థియేటరులో ఓ సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుంటే, లేచి నిలబడని ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉండే సయ్యద్ షఫీ హుస్సేన్ అనే యువకుడు, తన వివాహం కుదరగా ఇటీవలే హైదరాబాద్ విచ్చేసాడు. ఆపై స్నేహిడుతు మహ్మద్ ఇలియాస్ తో కలసి సినిమా చూసేందుకు ఐనాక్స్ కు వెళ్ళగా, సుప్రీంకోర్టు ఆదేశాల రీత్యా సినిమాకు ముందు ప్రారంభమైన జాతీయగీతం వస్తున్న సందర్భంలో లేచి నిలబడలేదు.

ఈ విషయం థియేటరులో ఉన్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అరెస్ట్ చేశారు. తాను మెట్లు ఎక్కుతుంటే కాలు వాచిందని, జాతీయ గీతం వస్తుంటే నిలబడేందుకు ప్రయత్నించానని హుస్సేన్ చెప్పినప్పటికీ పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే ఆ తర్వాత నాలుగు గంటల పాటు స్టేషన్ లోనే ఉంచారని, తమ వారికి సమాచారం ఇచ్చేందుకు కూడా ఆస్కారం లేకుండా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారని పోలీసులపై ఆరోపణలు చేసారు.

అయితే తన సోదరుడు 9 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండి ఇటీవలే వచ్చాడని, ఇక్కడి చట్టాలపై సరైన అవగాహన లేదని న్యాయవాదిగా ఉన్న హుస్సేన్ అన్న తెలిపారు. అయినా జాతీయ గీతం వస్తుంటే లేచి నిలబడాల్సిన అవసరం లేదని గత నెల 14న సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని సమర్ధించే ప్రయత్నం చేసారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదు అవుతుండగా, తాజాగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కేసులు నమోదు కావడం విశేషం.