nasa-warning-apocalyptic-fifteen-days-black-outనవంబర్ 15 నుంచి 29 వరకూ 15 రోజుల పాటు భూమిపై చీకట్లు ఆవరిస్తాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి 1000 పేజీల రిపోర్టు అధ్యక్షుడు ఒబామాకు వెళ్లిందని ఓ వెబ్ సైట్ వెల్లడించిన కథనం ప్రపంచ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టించింది. ‘బ్లాక్ అవుట్’గా పేరు పెట్టిన ఈ ఉత్పాతం ప్రభావం నవంబర్ 15 తెల్లవారుఝామున 3 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 4.45 వరకూ ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపినట్టు వెబ్ సైట్ పేర్కొంది.

ఇంతకీ ఎందుకు సూర్యుడి కాంతి పడదన్న విషయమై, వెబ్ సైట్లో పేర్కొన్న కథనం ఏంటంటే… సౌర వ్యవస్థలో జరిగే ఖగోళ పరిణామాల్లో భాగంగా, శుక్రుడు, గురు గ్రహాలు చాలా దగ్గరగా వస్తాయట. అప్పుడు వాటి మధ్య ధ్రుక్కోణం కేవలం ఒక డిగ్రీకి తగ్గిపోతుందని, గురుడు నైరుతి దిశగా శుక్రడిని అధిగమించి, సాధారణ స్థాయికన్నా పది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మారతాడట. ఈ చర్యతో శుక్రుడిలో వేడి పెరిగి విడుదలయ్యే వాయువుల ప్రభావంతో సౌర వ్యవస్థలో గతంలో ఎన్నడూ జరగనంతగా హైడ్రోజన్ వాయువులు అలముకుంటాయట.

వచ్చే నెల 15న తెల్లవారుఝామున 2.50 గంటల సమయంలో ఈ ప్రక్రియ మొదలుకాగా, సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఒక్కసారిగా 9 వేల డిగ్రీల కెల్విన్ కు చేరుతుందని సైంటిస్టులు పేర్కొన్నట్టు సదరు వెబ్ సైట్ వెల్లడించింది. దీంతో అంత వేడిని తట్టుకోలేని సూర్యుడు ఎరుపు రంగు నుంచి కాస్త నీలం రంగులోకి మారతాడని, ఈ ప్రభావంతో భూమిని చేరే సూర్యకాంతి తగ్గుతుందని చెప్పుకొచ్చింది. తిరిగి సూర్యుడు యథాస్థితికి రావడానికి రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంది.