Narendra-Modi-YS-Jagan-Visakhapatnamప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటన విజయవంతం చేసే పూర్తి బాధ్యతను జగన్ ప్రభుత్వం భుజానికి ఎత్తుకొంది కనుక అది విజయవంతమైనందుకు చాలా సంతోషించి ఉండాలి. అభివృద్ధి పనులన్నిటినీ ప్రధాని నరేంద్రమోడీ రిమోట్‌ బటన్ నొక్కి ఆరంభించినపుడు, ఆయన ఢిల్లీలో లేదా విజయవాడ నుంచి కూడా బటన్ నొక్కి ప్రారంభించవచ్చు. కానీ ఆయనను విశాఖకు రప్పించి బటన్ నొక్కించారు కనుక విశాఖ రాజధాని అనే వారి వాదనకు బలం చేకూరినట్లయిందనే అల్పసంతోషం తప్ప కొత్తగా ఓరిగిందేమీ లేదనే చెప్పాలి.

ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేసినందుకు వైసీపీకి ఏంటి?అని ప్రశ్నించుకొంటే ప్రస్తుతం జైలులో ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్ర రెడ్డికి త్వరలో బెయిల్‌ లభించవచ్చు. లేదా మళ్ళీ ఏపీకి భారీగా అప్పులు పుట్టవచ్చు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదు. కానీ జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఏపీ బిజెపికి ప్రధాని మోడీ రూట్ మ్యాప్ ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రతిగా వారు కొంత గ్యాప్ ఇచ్చి యుద్ధం ప్రారంభించవచ్చు.

వచ్చే ఎన్నికలలో టిడిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం ఈ మూడు రాజధానుల అంశాన్ని కూడా తెలివిగా ఉపయోగించుకోవాలనుకొంటోంది. నిజానికి జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధాని ఏర్పాటుచేయలేకపోతోంది కనుకనే మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ గర్జన అంటూ ర్యాలీలు, బహిరంగసభ నిర్వహించుకోవడం అందరూ చూశారు. కనుక ఈ రాజధాని వ్యవహారానికి కేంద్రం దూరంగా ఉండాలని కోరుకోవడం సహజం.

ఈ రాజధాని పంచాయతీ ఎలాగూ సుప్రీంకోర్టులో ఉంది కనుక ఈ విషయంలో కేంద్రం మళ్ళీ కలుగజేసుకొని చేతికి మట్టి అంటించుకోవలసిన అవసరమే లేదు. కనుక విశాఖ రాజధాని అంటూ జగన్ ప్రభుత్వం ఎంత హడావుడి చేసుకొన్నా కేంద్రం పట్టించుకోకపోవచ్చు. ఇదే వైసీపీకి కలిగిన ఏకైక ప్రయోజనంగా కనిపిస్తోంది.