ys jagan narendra modi

ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ నాయకులు మతం ఆధారంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ క్రిస్టియన్ కావడం తో, రాష్ట్రంలో జరిగే అన్యమత ప్రచారం మీద దేవాలయాల మీద దాడుల విషయంలో బీజేపీ పోరాటం చేస్తుంది. అయితే బీజేపీ తన ప్రయత్నం తాను చేస్తుంటే అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి జగన్ కు బాసటగా నిలుస్తున్నారు.

ఇటువంటి అన్ని విషయాలలో జగన్ ప్రభుత్వానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. స్వతాహా వివాదాల తో సాహచర్యం చేసే స్వామి ఈ మధ్య కాలంలో మోడీకి కూడా వ్యతిరేకంగానే ఉంటున్నారు. దీనితో 2022 తో పూర్తయ్యే ఆయన రాజ్యసభ కాలాన్ని పొడిగించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

అందుకోసమే ఆయన జగన్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బీజేపీ తో కాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ నుండైనా తనను రాజ్యసభకు తిరిగి నామినేట్ చెయ్యవచ్చని భావించి స్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం యథేచ్ఛగా సాగుతోందని, ఏడుకొండలపై చర్చి, శిలువ నిర్మాణం సాగుతోందంటూ మీడియాలో వచ్చిన కథనాల పై పరువు నష్టం దావా వేశారు స్వామి.

అసత్య వార్తలను ప్రసారం చేసిన, ప్రచురించిన ఆంధ్రజ్యోతి మీడియా హౌస్ పై ఏకంగా వందకోట్ల రూపాయలకు దావా వేశారు. అయితే ఇంత చేస్తున్నా… మోడీ, అమిత్ షాలను కాదని జగన్ స్వామిని రాజ్యసభకు తిరిగి నామినేట్ చేసే సాహసం చేస్తారా? పైగా రాజ్యసభ సీట్ల కోసం ఆయన పార్టీలోనే చాలా మంది ఆశావహులు ఉన్నారు.