Narendra_Modi_KCRఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత ఈ ప్రారంభోత్సవం చేయించాల్సి ఉండగా, ప్రధాని నరేంద్రమోడీ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. మోడీ ఓ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రపతిని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌, దాని 18 మిత్రపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. వాటిలో బిఆర్ఎస్‌ పార్టీ లేదు! కేసీఆర్‌తో చర్చించి ఈరోజు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని ఆ పార్టీ ఎంపీ కే. కేశవ్ రావు తెలిపారు.

అయితే ఇది కేసీఆర్‌కు సంకట పరిస్థితే అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని తాము కూడా బహిష్కరిస్తున్నామని చెపితే, కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఆరోపిస్తుంది. రాష్ట్రంలో నియంతపాలన చేస్తున్న కేసీఆర్‌కి పార్లమెంట్, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదంటూ విమర్శలు గుప్పిస్తుంది.

ఒకవేళ ఈ కార్యక్రమానికి హాజరైతే, మోడీ-కేసీఆర్‌, బిజెపి-బిఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే తమ వాదన నిజమని కేసీఆర్‌ మరోసారి నిరూపించారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తారు. కనుక కేసీఆర్‌కు ఇది ఇబ్బందికరమే అని భావించవచ్చు.

అయితే హైదరాబాద్‌లో డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా కేసీఆర్‌ సరిగ్గా ఇదేవిదంగా వ్యవహరించారు. రెండు కార్యక్రమాలకి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని ఆహ్వానించలేదు. ప్రతిపక్ష నేతలను ముఖ్యమంత్రి లేదా మంత్రుల చేత ఆహ్వానించకుండా దిగువ స్థాయి అధికారుల చేత ఆహ్వానింపజేయడంతో వారు రెండు కార్యక్రమాలను బహిష్కరించారు. గవర్నర్‌, ప్రతిపక్షాలు లేకుండానే కేసీఆర్‌ రెండూ కానిచ్చేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం అంటూ ప్రసంగాలు చేశారు. నేటికీ సచివాలయంలో ప్రతిపక్ష నేతలను అనుమతించడం లేదు.

ప్రతిపక్షాలు కేసీఆర్‌ నియంతృత్వ వైఖరిని ఎంతగా ఖండిస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇటువంటి నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. ఇప్పుడు మోడీ కూడా రాష్ట్రపతి, ప్రతిపక్షాలు లేకుండానే పార్లమెంట్ ప్రారంభోత్సవం చేసేందుకు సిద్దపడుతున్నారు.

మోడీ, కేసీఆర్‌ వైఖరిలో ఇంత స్వారూప్యత ఉండటం విశేషమే. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడన్నట్లు ఇద్దరి తీరు ఇంచుమించు ఒకేవిదంగా ఉన్నందునే వారు కత్తులు దూసుకొంటున్నారు. ఇద్దరి తీరు ఒకే విదంగా ఉన్నందునే అవసరమైనప్పుడు సహకరించుకొంటున్నారు కూడా. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు కేసీఆర్‌ దూరంగా ఉండటమే ఇందుకు తాజా నిదర్శనం.

కనుక ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని కేసీఆర్‌ చెప్పినా ఆశ్చర్యం లేదు. ప్రజాస్వామ్యాన్ని మోడీ ఖూనీ చేస్తున్నందున హాజరుకావడం లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఉన్నదల్లా రాజకీయ అవసరాలు, రాజకీయ లాభనష్టాల లెక్కలే తప్ప ప్రజాస్వామ్యమూ కాదు రాజ్యాంగ విలువలు కావని మాత్రం భావించవచ్చు.