narendra-modi-vs-chandrababu-naidu2014 ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర మొత్తం ఊగిపోయింది. విభజనతో అన్యాయం అయిపోయిన రాష్ట్రం… దారంతా చీకటి… ఎటుపోతున్నామో తెలియని పరిస్థితి… అప్పుడు ఆశాజ్యోతిగా కనిపించారు చంద్రబాబు నాయుడు, మోడీల జోడి. ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను ప్రపంచ మ్యాప్ లో పెట్టిన ఘనుడు. ఇంకొకరు గుజరాత్ మోడల్ అంటూ దేశం మొత్తాన్ని ఆకర్షించిన మోడీ. వీరిద్దరూ కలిస్తే కొత్త రాష్ట్రం రూపు రేఖలు మారిపోతాయి అనుకున్నారు జనం.

వారికి నీరాజనం పట్టారు. అయితే ఎన్నాళ్ళు ఇలా ఆంధ్రలో టీడీపీకి తోక పార్టీగా ఉంటాం అనుకున్నారో లేక గతంలో చంద్రబాబు గోధ్రా అల్లర్ల సమయంలో తన రాజీనామా కోసం ఒత్తిడి చేసిన విషయం గుర్తోచిందో మొదటి రోజు నుండీ ప్రతిపక్షంగా మారిపోయింది బీజేపీ. రాష్ట్ర బీజేపీలోని భట్రాజులతో ప్రభుత్వంలో ఉంటూనే విమర్శలు చేయించారు. సరే ఈ బడ్జెట్ కాకపోతే ఇంకో బడ్జెట్… ఇప్పుడు ఇస్తే ఆ రాష్ట్ర ఎన్నికలలో ఇబ్బంది అంటూ వేచి చూశారు టీడీపీ వారితో పాటు జనం.

అయితే మొత్తానికి మొండి కేసి టీడీపీని ఇరుకున పెట్టారు. ద్రోహం చేసినా కేంద్రంలో ఎందుకు ఉంటున్నారని చంద్రబాబుపై ప్రతిపక్షాల ఒత్తిడి అయినా ఏదో ఒకటి చెయ్యకపోతారా అన్న ఆశతో పొత్తు కొనసాగించారు చంద్రబాబు. బయటకు వస్తే రాష్ట్రం మీద మరింత కక్ష సాధిస్తారని చివరి వరకు ఆగారు. కాకపోతే రాష్ట్రానికి మేలు జరగకపోగా అది టీడీపీకి రాజకీయంగా నష్టం చెయ్యడంతో మొత్తానికి విడాకులు తీసుకున్నారు చంద్రబాబు. బయటకు వచ్చాక కూడా తమ బాకా ఊదాలని అనుకున్నారు మోడీ.

అయితే చంద్రబాబు తిరగబడ్డారు. రాష్ట్ర బీజేపీ రెచ్చిపోయి మరింత ఇబ్బంది పెట్టడంతో ఇక బీజేపీని ఓడిస్తే తప్ప రాష్ట్రానికి మనుగడ లేదనుకుని కాంగ్రెస్ వైపుకి వెళ్లి తిరగబడ్డారు. తిరగబడినందుకు ఈగో అడ్డొచ్చింది మోడీ గారికి. అందుకే ప్రధాని హోదాలో ఉండి కూడా స్థాయికి తగని ఆరోపణలు చేశారు ఈరోజు. మామకి వెన్నుపోటు పొడిస్తే 2014లో ఆయన పంచన మీరెందుకు కూచున్నట్టు? బాప్ బేటా సర్కార్ అనుకుంటే అమరావతికి వచ్చి నారా లోకేష్ తో ఆ ముచ్చట్లు ఎందుకు? అవినీతి చేస్తే టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చే వరకూ ఎందుకు మాట్లాడలేదు?

ఇవన్నీ అవకాశవాద రాజకీయమే కదా? ప్రధాని స్థాయికి ఇది తగునా? సరే అవినీతి చేస్తే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చెయ్యాలి కానీ రాష్ట్రానికి నిధులు ఆపేయడం ఏంటి? మోడీ విమర్శలతో తన స్థాయి మర్చిపోయి మాట్లాడటంతో చంద్రబాబు కూడా అదుపు తప్పారు. “నేను లోకేష్ తండ్రినే మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్‌ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది,” అని విరుచుకుపడ్డారు.

“నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అంటున్నారు. గురువుకు నామాలు పెట్టింది మీరు. అడ్వాణీ నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది” అంటూ మోడీ పై విరుచుకుపడ్డారు. రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్రం భాగ్య రేఖలు మారుస్తారు అనుకున్న జోడీ ఐదు సంవత్సరాలు తిరగకముందే ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబుదే తప్పు అనుకుంటే దేశంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన ఒక్క పార్టీ కూడా సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. 2014లో స్వయంగా వచ్చిన మెజారిటీ ఇచ్చిన బలుపు ఇక్కడకి తీసుకు వచ్చింది. మిగతా విషయాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజల ఆశల మీద మన్నూ నీరు కొట్టేశారు. ఇప్పుడు వీధులలో ముష్టి యుద్ధాలు చూడాల్సి వచ్చింది.