Narendra Modi verbal attack on Chandrababu-Naiduతెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాకా మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరూ అనుకున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ టీడీపీతో కలిసి ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో అయితే పార్టీని పెట్టారో దానిని మంటగలిపి ఆయన ఆత్మను బాధ పెట్టారు అంటూ సెంటిమెంటు పండించే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి. అన్నీ చేసేశాం అన్నీ ఇచ్చేశాం… కాకపోతే లెక్కలు అడుగుతున్నందుకే చంద్రబాబుకు మేమంటే ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

2014 ఎన్నికలకు ముందు గుర్తుకు రాని వెన్నుపోటు విషయం కూడా మోడీ ఇప్పుడు గుర్తు వచ్చింది. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు నారా లోకేష్ భుజం తట్టి, నారా దేవాన్ష్ బుగ్గ నిమిరిన మోడీ ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పని చేస్తున్నారని, కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి పని చేశారని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ మీద ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పకుండా అందులోని బెనిఫిట్స్ అన్నీ స్పెషల్ ప్యాకేజీలో ఇచ్చాం అప్పుడు స్వాగతించి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు మోడీ.

అమరావతి నుండి పోలవరం వరకు నిధులు వాడుకుని కుటుంబ ఆస్తులు పెంచుకున్నారని కూడా ఆరోపించడం విశేషం. తన స్పీచ్ అంతటా చంద్రబాబును లోకేష్ తండ్రి అని సంబోధించడం విశేషం. తన స్పీచ్ ని ముగిస్తూ ఆంధ్రలో బాప్ – బేటా సర్కార్ దించడం ఖాయమని ప్రకటించారు. అయితే ఇది రొటీన్ రాజకీయ ప్రసంగం చేసిన మోడీ అసలు విషయాలు వదిలేశారు. స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేకపోయాం అనేది వివరించే ప్రయత్నం చెయ్యలేదు. కొద్ది రోజుల ముందు అమిత్ షా ఐదు లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పుకొస్తే మోడీ మూడు లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పారు.

అయితే మోడీ చేసిన ఆరోపణలు అన్ని నాలుగున్నర ఏళ్ళ తరువాత, టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాక గుర్తు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి కొత్త హామీ ఇవ్వలేదు. కేవలం చంద్రబాబుని దింపి రాష్ట్రానికి తోడు ఉంటాం అని హామీ మాత్రమే ఇచ్చారు. మొత్తంగా ఇది బీజేపీ శ్రేణులకు ఉత్సాహకారంగానూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిరాశగానూ సాగింది అని చెప్పుకోవాలి. అదే సమయంలో ప్రతిపక్షాలకు చంద్రబాబు నాయుడును తిట్టడానికి మరింత మెటీరియల్ ఇచ్చారు. కాకపోతే బీజేపీని ద్వేషించే టీడీపీ శ్రేణులకు మరింత దూషించడానికి మోడీ స్పీచ్ దోహద పడుతుంది.