KCR_Narendra_Modiఏపీ సిఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకి వినయవిధేయంగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ కత్తులు దూస్తున్నారు. కనుక ఏపీకి అప్పులు, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే, తెలంగాణకి ఈడీ, ఐ‌టి, సీబీఐలని పంపిస్తున్నారు. జగన్‌, విజయసాయి రెడ్డిలపై 11 అక్రమస్తుల కేసులున్నప్పటికీ అవన్నీ నత్తనడకలు నడుస్తుంటే, తెలంగాణలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కొత్త కేసులు ఉరుకుల పరుగుల మీద దర్యాప్తులు, సోదాలు, విచారణలు సాగుతున్నాయి.

సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుతో బందించేందుకు కేంద్ర ప్రభుత్వం చురుకుగా పావులు కదుపుతోంది.

ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రరెడ్డి, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని, వారి అధ్వర్యంలోనే ఈ కుంభకోణం జరిగిందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 36 మంది నిందితులను గుర్తించి వారిలో పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది.

బుదవారం అమిత్ ఆరోడా అనే వ్యక్తిని ఈడీ కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరుని కూడా చేర్చింది. ఈ కేసుకి సంబందించి పలు ఆసక్తికరమైన విషయాలను ఈడీ ఆ నివేదికలో బయటపెట్టింది.

ఈ కుంభకోణం బయటపడిన తర్వాత దీనిలో నిందితులు మొత్తం 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడమో లేదా దానిలో నిక్షిప్తమైఉన్న డేటాని నాశనం చేయడమో చేశారని పేర్కొంది. ఈ కేసుకి సంబందించి కీలకమైన సాక్ష్యాధారాలు దొరకకుండా తప్పించుకొనేందుకే వారు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.

అయినప్పటికీ 17 ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటి నుంచి కీలకమైన సమాచారం సేకరించామని ఈడీ పేర్కొంది. శరత్ చంద్ర రెడ్డి 9 ఫోన్లు, కల్వకుంట్ల కవిత 10 ఫోన్లు, ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు 6 ఫోన్లు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 14 ఫోన్లు, బోయినపల్లి అభిషేక్ 5 ఫోన్లు, సృజన్ రెడ్డి 3 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది.

వీరందరూ కలిసి మద్యం తయారీ కంపెనీలకు, మద్యం వ్యాపారులకు, మద్యం సిండికేట్లకు, రాజకీయ నాయకులకు వందల కోట్లు కమీషన్ల రూపంలో ముట్టేలా ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వం చేత మద్యం పాలసీని తయారుచేయించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

కల్వకుంట్ల కవిత తాను నిరపరాధినని ఎంత గట్టిగా వాదిస్తున్నప్పటికీ, ఏ ఆధారాలు లేకుండానే ఈడీ ఆమె పేరుని ప్రస్తావించే సాహసం చేస్తుందనుకోలేము. కనుక ఆమె చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తున్నట్లే అర్దం అవుతోంది. ఇంతకాలం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ గురించి బిజెపి నేతలో లేదా మీడియాలో వార్తలలో మాత్రమే కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తుండేది. కానీ తొలిసారిగా ఈడీ కోర్టుకి సమర్పించిన నివేదికలో ఆమె పేరుని ప్రస్తావించింది. దీనిని సిఎం కేసీఆర్‌కి కేంద్రం చేసిన చివరి హెచ్చరికగానే భావించవచ్చు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి పెద్దలను ఇరికించి దెబ్బతీయాలని చూస్తే, ఈ కేసులో కల్వకుంట్ల కవితని కూడా జైలుకి పంపించగలమని సూచిస్తున్నట్లే ఉంది. అలాగే ప్రధాని మోడీని గద్దె దించుతానంటూ కేసీఆర్‌ దూకుడు తగ్గించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించినట్లే భావించవచ్చు. కనుక ఇప్పుడు బంతి కేసీఆర్‌ కోర్టులోనే ఉంది. మరి ఆయన సమరమా… శరణమా? ఏమంటారో చూడాలి.