Narendra Modi Targets Doctorsపావలా ఖర్చుతో తయారయ్యే మందు బిళ్లను రూపాయి పావలాకు అమ్మే ఔషధ కంపెనీల అక్రమాలను అరికట్టే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. డాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకునే ఫార్మా కంపెనీలు, వారికి తాయిలాలు ఇస్తూ, తమ పబ్బం గడుపుకుంటూ, ప్రజలను దోచుకుంటున్నారని భావిస్తున్న కేంద్రం, ఫార్మా కంపెనీలు, డాక్టర్ల మధ్య ఉన్న అనైతిక బంధాన్ని తెంపే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఔషధాల ధరలను తగ్గించేలా సరికొత్త చట్టాన్ని తేవాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం.

ఇందులో జనరిక్ ఔషధాల తయారీ, వాటి డోసేజ్, క్వాలిటీ, సేఫ్టీ, పనితీరు తదితరాలపై కొత్త నిబంధనలతో పాటు, బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే, చాలా తక్కువ ధరకు లభించేలా చూడటం, మార్కెట్లో విరివిగా లభ్యత వంటి అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సహజంగా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసే సమయంలో పేదలు, సామాన్యులకు అర్థం కాని చేతి రాతను వినియోగిస్తున్నారు. ఇక ఆ మందులను తాము సూచించే ప్రైవేటు మెడికల్ స్టోర్ల నుంచే రోగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని మారుస్తాం. ఇందుకోసం చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం.

ఏ డాక్టరైనా ప్రిస్క్రిప్షన్ లో రాస్తున్న ఔషధం జనరిక్ వర్షన్ నూ కొనుగోలు చేసేలా సూచించడాన్ని తప్పనిసరి చేస్తాం. పేషంట్లు తమకు నచ్చిన చోట మందులు కొనుక్కునేలా నిబంధనలు మారుస్తాం” అని ప్రధాని సూరత్ లో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తూ వ్యాఖ్యానించారు. ఇండియాలో ఆసుపత్రులకు పెట్టే ఖర్చు తక్కువని, మందులకు పెట్టే ఖర్చే ఎక్కువని, ఈ ఖర్చు మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారిందని అన్నారు. దాదాపు 15 సంవత్సరాల తరువాత ఔషధ ధరలపై నియంత్రణను తాము అమలు చేస్తున్నామని, స్టెంట్ల ధరలను తగ్గించామని ఆయన గుర్తు చేశారు.

మధ్య తరగతి కుటుంబంలో ఒకరు జబ్బున పడితే, ఆ కుటుంబం సొంతింటిని సమకూర్చుకోలేనంత దుర్భర స్థితికి జారిపోతోందని, ఇంట్లో ఆడపిల్ల వివాహానికి కూడా వీల్లేనంతగా ఆర్థిక స్థితి ఘోరంగా మరుతోందని, ఈ పరిస్థితిని మారుస్తామని అన్నారు. కనీస ధరలకు ప్రతి ఒక్కరికీ వైద్య సేవలను దగ్గర చేయడం తమ ప్రభుత్వ బాధ్యతగా చెప్పారు. ఇటీవలే కొత్త హెల్త్ పాలసీని తీసుకువచ్చామని, ‘ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన’ స్కీమును అమలు చేస్తున్నామని, దీని ద్వారా చౌక ధరలకు జనరిక్ ఔషధాలను ప్రజలకు దగ్గర చేశామని, ఈ కేంద్రాలకు వచ్చి మందులు కొనుగోలు చేయడాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు.