Narendra Modi Speech at Vizag public Meeting       ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో బహిరంగసభలో పాల్గొన్నప్పుడు పలు అభివృద్ధి పనులను రిమోట్ ద్వారా భారత్‌ నొక్కి ప్రారంభించిన తర్వాత ‘సోదరి, సోదరులారా.. అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఇది అధికారిక కార్యక్రమం కనుక ఊహించినట్లే ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం చాలా చప్పగా సాగింది. ఇటీవలే తాను భీమవరంలో పర్యటించి మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

తెలుగు ప్రజలు చాలా మంచివారని మెచ్చుకొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సాంకేతిక, వైద్య రంగాలలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్నారని ప్రధాని నరేంద్రమోడీ మెచ్చుకొన్నారు.

ప్రాచీన భారత్‌లో కూడా విశాఖ నగరానికి, ఇక్కడి ఓడరేవుకి ప్రత్యేకమైన స్థానం ఉందని మెచ్చుకొన్నారు. దేశంలో రక్షణ, పారిశ్రామిక, వ్యాపార రంగాలలో విశాఖ నగరం చాలా ముందుందని, దేశాభివృద్ధిలో చాలా కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎప్పుడు తనను కలిసిన ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే నేడు ఇన్ని కోట్లు విలువగల ప్రాజెక్టులను ప్రారంభించడానికి విశాఖకు వచ్చామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.

నేటికీ అనేక దేశాలు వెనుకబడి ఉండగా భారత్‌ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచదేశాలకు భారత్‌ ఓ ఆశాదీపంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ భారత్‌ గొప్పదనాన్ని గుర్తించి, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

ప్రధాని సభకు జగన్ ప్రభుత్వం భారీగానే జనసమీకరణ చేయడంతో సభ విజయవంతం అయ్యింది. సభ ముగించుకొని ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ బయలుదేరుతున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, బిజెపి ముఖ్యనేతలు ఆయనకు విమానాశ్రయంలో వీడ్కోలు పలుకనున్నారు.