UP-CM-yogi-adityanath--Narendra-Modiదాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్‌ లో బిజెపి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ నిశితంగా పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీహార్ పై మోడీ విపరీతమైన ప్రేమ చూపించి, ఎన్నికల సమయంలో వరాల జల్లు కురిపించారు. దీంతో బీహార్ లో విజయం తమనే వరిస్తుందని ఆశించారు. అయితే బీహారీలు మోడీని విశ్వసించలేదు. దీంతో నితీష్ – లాలూ కూటమి అధికారం చేపట్టింది.

అలాగే ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ఓట్లు ప్రభావవంతంగా ఉండడంతో యూపీలో విజయం చాలా కష్టమని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ఎన్నికల ప్రచారం సమయంలో పేర్కొన్నాయి. అయితే ఊహించని మెజారిటీతో యూపీని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో యూపీపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ప్రధాని నిర్ణయించినట్లుగా కనపడుతోంది. అదీ కాక యూపీకి ముఖ్యమంత్రిగా వివాదాస్పద మత గురువుగా పేరొందిన ఆదిత్యనాథ్ ను ఎంపిక చేయడంతో వివాదాలు చుట్టుముట్టకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో యూపీలో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై నిఘా పెట్టాలని భావిస్తున్నారని సమాచారం. దీంతో ఈ నిఘాను సమర్థవంతంగా నిర్వహించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నృపేంద్ర మిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది. దీంతో పీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అయిన మిశ్రా సీఎం యోగి ఆదిత్యనాథ్ తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ప్రధాని మోడీకి – సీఎం యోగికి మధ్య దూతగా మిశ్రా వ్యవహరించనున్నారని, నిత్యం యోగితో టచ్ లో ఉంటూ, యూపీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అయిన ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం రాసింది. అందులో యూపీ కేడర్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను 2014లో ప్రధాని అయిన తర్వాత మోడీ ప్రత్యేకంగా కేంద్రానికి పిలిపించుకున్నారని పేర్కొంది. యూపీ ప్రభుత్వం భవిష్యత్ లో చేపట్టబోయే నియామకాలన్నీ మిశ్రా ధ్రువీకరించిన తరువాతనే చేపట్టనున్నట్టు తెలుస్తోంది.