Kanna Lakshmi Narayanaప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అన్ని రకాల చిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గోబ్యాక్ మోడీ అంటూ నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రధానికి ఎక్కడా లేనంత సెగ తగులుతుంది. మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు గన్నవరం విమానాశ్రయంలో చుక్కెదురైంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన కాసేపటి క్రితం విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఆయనను ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

ప్రధానిని కలిసేందుకు వచ్చే వారిలో పేరు లేదంటూ ప్రధాని భద్రతా సిబ్బంది కన్నాను విమానాశ్రయంలోకి అనుమతించలేదు. కన్నా వారిని ఎంతగా ప్రాధేయపడినా వారు అనుమతించలేదు. దీనితో చేసేది ఏమీ లేక ఆయన బయటే ఉండిపోయారు. మరోవైపు ప్రధానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ప్రధానికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరూ ప్రధానిని స్వాగతం పలకడానికి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తదితరులు వచ్చారు.

ప్రధాని హోదాలో పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావటం ఇదే తొలిసారి. మరోవైపు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రధాని పాల్గొంటారు. ప్రధాని పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాలకు కూడా రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రప్రభుత్వం తరపున ఎవరూ హాజరు కావడం లేదు.