Narendra Modi Responds on Go back modi slogansప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మాటల మాంత్రికుడు అంటారు అంతా. ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కూడా దానిని ఒప్పుకుంటారు. ఆయన వాక్చాతుర్యం ఎంత గొప్పదో ఈ రోజు మరో సారి రుజువు చేసారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాని పర్యటన సందర్భంగా చేసిన నిరసనలను తనకు అనుకూలంగా మార్చి చెప్పుకున్న తీరు అమోగం. గోబ్యాక్ మోడీ, నల్ల బుడగలు ఎగురవేయడం వంటి వాటిని ఆయన అనుకూలంగా మార్చుకున్నారు.

గోబ్యాక్ మోడీ అని టీడీపీ వారు అంటున్నారు. వారి ఉద్దేశం బహుశా నేను ఢిల్లీ వెళ్లిపోవాలని… 2019 ఎన్నికల తరువాత మళ్ళి ఢిల్లీ వెళ్లిపొమ్మని అంటున్నారు అంటే తిరిగి అధికారంలోకి రమంటున్నారు… దానికి వారికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు మోడీ. నేను వస్తున్నప్పుడు కొందరు నల్ల బుడగలు ఎగురవేయడం చూసాను. నేను ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నా… ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావడానికి ముందుకు సాగుతున్నా… ఈ శుభకార్యానికి వారు నల్ల బుడగలతో దిష్టి చుక్కలు పెడుతున్నారు … దానికి వారికి ధన్యవాదాలు… అన్నారు ఆయన.

తన ప్రసంగంలోని పూర్తి భాగం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చిన మోడీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధుల కంటే ఎక్కువే ఇచ్చామని మాత్రమే చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర పథకం హృదయ్‌ కింద అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని కేవలం లెక్కలు అడుగుతున్నాం అనే కారణంతోనే తమతో విభేదించి చంద్రబాబు బయటకు వచ్చారని ఆరోపించారు.