Narendra Modi Protests in Telangana grand welcome in APవిశాఖ రాబోతున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నభూతో నభవిష్యతి స్థాయిలో ఘనస్వాగతం పలికి అట్టహాసంగా బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసనలు, ఛీత్కారాలను సిద్దం చేస్తోంది కేసీఆర్‌ ప్రభుత్వం. గత కొంతకాలంగా సిఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ మీద కత్తులు దూస్తున్నారు కనుక ఆయన కనీసం ప్రధాని హైదరాబాద్‌ వచ్చినప్పుడు నగరంలోనే కేసీఆర్‌ ఉన్నప్పటికీ స్వాగతం చెప్పేందుకు వెళ్ళడం మానేశారు. ఇటీవల ఫామ్‌హౌస్‌ ఉదంతం బయటపడినప్పటి నుంచి కేసీఆర్‌ ఆగ్రహం మరింత పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనుక ఎక్కడికక్కడ ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ బ్యానర్లు సిద్దం అవుతున్నాయి. ఇక కొత్తగా దోస్తీ కుదిరిన కమ్యూనిస్టులను కూడా ఎక్కడికక్కడ మోడీని అడ్డుకొనేందుకు ఉపయోగించుకొంటున్నారు. వారు ప్రధాని నరేంద్రమోడీకి అడుగడుగునా నిరసనలు తెలియజేస్తామని ప్రకటించారు కూడా. ఇక టిఆర్ఎస్‌ అనుబంద విద్యార్ధి సంఘాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాయి.

అసలు ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత కోల్పోయారని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే గౌరవంగా స్వాగతం పలికి సాగనంపడం కనీస మర్యాద. కనీస ధర్మం. కానీ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడాన్ని నిషేధిస్తున్నట్లే టిఆర్ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పుకోవచ్చు.

కనుక శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోడీకి ఆ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు, ప్రోటోకాల్ కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున మొక్కుబడిగా ఓ మంత్రి, ఒకరిద్దరు అధికారులు మాత్రమే హైదరాబాద్‌లో స్వాగతం పలుకుతారు.

ఆ తర్వాత రామగుండంలో పర్యటన పూర్తి చేసుకొని మళ్ళీ విమానం ఎక్కేవరకు ప్రధాని నరేంద్రమోడీకి అన్నిచోట్ల నల్లజెండాలు, నిరసనలు ఎదుర్కోక తప్పదు. ప్రధాని పర్యటనలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏమాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి దొరికిపోయినా దానికి భారీ మూల్యం చెల్లించవలసిరావచ్చని గ్రహించినట్లు లేదు.