KCR - Narendra Modiప్రధాని మోడీ తో ముందస్తు ఎన్నికల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించిన విషయాన్ని చెప్పడానికి తెరాస వర్గాలు పెద్దగా సుముఖత చూపడం లేదు. ప్రధాని అనుమతి తీసుకొని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తే మైనార్టీల్లో తమపట్ల వ్యతిరేకత వస్తుందేమోనన్న అంచనా తెరాస నేతల్లో ఉంది.

డిసెంబర్‌లోపు ఎన్నికలు జరిగేలా చూడాలని, ఈ విషయాన్ని ప్రధాని ద్వారా ఈసీకి చెప్పించాలని కేసీఆర్‌ ప్రయత్నం చేశారు. ఈ పని చేసి పెడితే భవిష్యత్తులో అవసరమైన సాయం చేసి పెడతామని చెప్పి వచ్చారట. అయితే ఆ మాట బయటకు చెప్తే స్వతంత్రప్రతిపత్తిగల ఈసీని ప్రధాని ప్రభావితం చేశారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి. ఇలాంటి అంచనాల నేపథ్యంలోనే తెరాస వర్గాలు మోదీ- కేసీఆర్‌ మధ్య జరిగిన ముందస్తు చర్చల అంశానికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.

అందుకే జోనల్‌, ఇతర అంశాల గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా నిరుద్యోగుల నుంచి విమర్శలు ఎదురవకుండా చూసుకోవడానికే కేసీఆర్‌ జోనల్‌ వ్యవస్థ గురించి ప్రధానమంత్రి వద్ద పట్టుబట్టి ఆమోదం పొందినట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో రెండు పార్టీలు ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాయనేది ఓపెన్ సీక్రెట్.