narendra-modi-over-reservationsకులాల రిజర్వేషన్లతో ఏపీ భగ్గుమంటోంది. ప్రస్తుతం పరిస్థితులు చల్లబడినా, నివురు గప్పిన నిప్పులా ఉన్న రాష్ట్రం ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ సమయంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోడీ కులాల రిజర్వేషన్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలంగా తాకాయి.

“ఇండియాలో కొత్తగా రిజర్వేషన్లు ప్రకటించడం గానీ, ఉన్న రిజర్వేషన్లలో మార్పులు గానీ ఉండవని” ప్రధాని చేసిన స్పష్టమైన ప్రకటన ఏపీలోని కాపు వర్గాలను ఉద్దేశించి చేసినట్లుగా కనపడుతోంది. కేంద్రం ఏపీకి కేటాయించే నిధుల సంగతి పక్కన పెడితే మనోధైర్యాన్నిచ్చే మాటలు మాత్రం చెబుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వెంటనే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీయడం, అండగా ఉంటామని చెప్పడం గత 20 మాసాలుగా చూస్తూనే ఉన్నాం.

మరి బీసీలను కాపుల్లోకి చేర్చే విషయంపై గానీ, ఇటీవల జరిగిన సంఘటనపై గానీ ప్రధాని సంగతి పక్కన పెట్టినా, వెంకయ్య నాయుడు కూడా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో కేంద్ర వైఖరి ఏమిటో పరోక్షంగా ఏపీకి పంపినట్లయ్యింది. దీనికి తోడు తాజాగా తమిళనాడులో కుల రిజర్వేషన్లపై ప్రధాని ప్రసంగం ఒకటి. చంద్రబాబు సంకల్పించిన ఈ కార్యం నెరవేరాలంటే ఖచ్చితంగా రాజ్యంగ సవరణ కావాల్సిందే. అంటే కేంద్రం సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. మరి కేంద్రం వ్యవహార తీరు చూసిన తర్వాత కూడా కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చర్చ అవసరమంటారా..?!