Narendra-Modi-New-Parliament-Buildingఈ నెల 29న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. అయితే రాష్ట్రపతి ద్రౌపదీ ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరుగవలసిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ చేస్తుండటంతో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ఆ కార్యక్రమానికి హాజరుకాబోవడం లేదని ప్రకటించాయి.

దీంతో ప్రధాని నరేంద్రమోడీ వ్యూహాత్మకంగానే తాను ప్రారంభోత్సవం చేయాలనుకొంటున్నారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, మరో ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఓ వైపు కేసీఆర్‌, మరోవైపు నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, వారి మిత్రపక్షాలు మోడీని గద్దె దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనుక వచ్చే ఎన్నికలలో బిజెపివైపు ఉండేది ఎవరో, బిజెపిపై కత్తులు దూసేది ఎవరో తేల్చుకోవడానికే ప్రధాని నరేంద్రమోడీ ఈవిదంగా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రభుత్వం నడిపిస్తూ, కేసులను నెట్టుకొస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి సహజంగానే ఈ ప్రతిపాదనను స్వాగతించి, ఈ కార్యక్రమానికి హాజరవుతానని ట్వీట్‌ చేశారు. బిజెపి తమతో పొత్తులకు ససేమిరా అంటోంది కనుక టిడిపి ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలే ఎక్కువ. జనసేన కూడా హాజరవడం ఖాయమే. అంటే ఏపీలో అధికార, విపక్షాలు రెండూ మోడీతో స్నేహమే కోరుకొంటున్నాయని స్పష్టమవుతుంది. కనుక తమలో ఎవరితో స్నేహం చేయాలో మోడీకే ఆప్షన్ ఇస్తున్నట్లు భావించవచ్చు. ఉత్తరాదిలో బలమైన దళిత ఓట్ బ్యాంక్ కలిగిన బీఎస్పీ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కనుక ఈ కార్యక్రమానికి హాజరైతే బిజెపితో దోస్తీకి సిద్దమని చెప్పిన్నట్లే భావించవచ్చు.

ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. కనుక ఆయన కేసీఆర్‌ లేదా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపబోనని హామీ ఇచ్చిన్నట్లే. ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఈ కార్యక్రమానికి హాజరవుతామని చెపుతున్నాయి. కనుక బిజెపికి అండగా మిత్రపక్షాలు ఉన్నట్లే.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కత్తికి రెండు వైపులా పదునే కనుక ఆయన హాజరైనా కాకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో సీట్లు బిజెపికి విడిచిపెట్టబోరనేది స్పష్టం. ఎన్నికల తర్వాత ఎటువైపు ఉండాలనేది తేల్చుకోవచ్చు. మజ్లీస్‌ కూడా కేసీఆర్‌ వెంటే ఉంటుంది కనుక ఈ కార్యక్రమానికి హాజరుకామని చెప్పేసింది.

తమిళనాడులో అధికార డీఎంకె, ఎండీఎంకెలు ఈ కార్యక్రమంలో పాల్గొనబొమని తేల్చి చెప్పేశాయి. కనుక అవి కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంకా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలనుకొంటున్నశివసేన, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఝార్కండ్ ముక్తి మోర్చా, మరికొన్ని పార్టీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకామని చెప్పేసాయి. మొత్తం 20 పార్టీలు హాజరుకావడం లేదు. అంటే వాటితో బిజెపి పోరాడవలసి ఉంటుందన్న మాట!

ఈ నెల 28నాటికి బిజెపి వైపు ఎన్ని పార్టీలున్నాయో, అవతలివైపు ఎన్ని ఉన్నాయో తేలిపోతుంది. అంటే రెండు వైపులా రాజకీయ పునరేకీకరణ అప్పటికి పూర్తయినట్లు భావించవచ్చు. అప్పుడు ఆ ప్రకారం రెండు వర్గాల బలాబలాలపై స్పష్టత వస్తుంది. ఆ ప్రకారమే రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.