Narendra Modi New Cabinetప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో నలుగురికి ప్రమోషన్ ఇవ్వగా, 9 కొత్త ముఖాలను కేబినెట్ లోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించిన వారిలో నలుగురు మంత్రులు ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆ నలుగురు కేంద్ర మంత్రులు గతంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల్లో విధులు నిర్వర్తించడం విశేషం. దీంతో తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో ఈ నలుగురిపై ప్రత్యేక దృష్టి నిలిచింది. ఈ నేపథ్యంలో వారి వివరాల్లోకి వెళ్తే…

(1) హర్దీప్‌ సింగ్‌ పూరి: ఇండియన్ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి. 1974 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌ కు చెందిన హర్దీప్‌ సింగ్ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం రీసెర్చ్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్ కంట్రీస్‌ థింక్‌ థాంక్‌ కు చైర్మన్‌ బాద్యతలతో పాటు న్యూయార్క్‌ లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌ ఇండియా సభ్యుడిగా, కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్‌ గా విధులు నిర్వర్తించడం విశేషం.

(2) అల్ఫోన్స్ కన్నంథనమ్ : 1979 కేరళ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. కేరళలోని కొట్టాయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన ట్రాక్‌ రికార్డు అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీ డెవలప్‌ మెంట్‌ అథారిటీ కమిషనర్‌ గా విధులు నిర్వహించిన ఆయన, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడంతో ‘విధ్వంసకార అధికారి’గా గుర్తింపు వచ్చింది. అయితే ఆయన 2006 లో సర్వీస్‌ కు గుడ్‌ బై చెప్పి సీపీఐ(ఎం) మద్ధతుదారుడిగా కంజిరాపల్లి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదేళ్ల తరువాత బీజేపీలో చేరారు. కేరళలో ఆరెస్సెస్‌-క్రిస్టియన్‌ గ్రూపుల మధ్య సంధానకర్తగా వ్యవహరించారు.

(3) రాజ్‌కుమార్‌ సింగ్‌ (ఆర్కే సింగ్): 1975 ఐఏస్‌ బీహార్ బ్యాచ్‌ కు చెందిన రాజ్‌ కుమార్‌ గతంలో హోం సెక్రటరీగా (2011-13) విధులు నిర్వహించారు. 2014 లో బీజేపీలో చేరిన ఆయన, బీహార్‌ లోని ఆర్రా నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఐఏఎస్ అధికారిగా ఉండగా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు. 1990లో లాలూ ఆదేశాలతో బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని అరెస్టు చేయించారు. 2015లో క్రిమినల్స్ కు సీట్లు కేటాయించడంపై పార్టీ పైనే ఆగ్రహం వ్యక్తం చేసి, నిజాయితీ పరుడైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

(4) సత్యపాల్‌ సింగ్‌: మహారాష్ట్ర కేడర్‌ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆయన, తనని తాను పెద్ద గూండాగా అభివర్ణించుకుంటూ, ముంబై మున్సిపల్ కమిషనర్‌ నగరాన్ని గడగడలాడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌ కౌంటర్‌ కేసును ఆయనకు 2011 జూన్‌ లో ప్రభుత్వం అప్పజెప్పింది. కొంత కాలం విధులు నిర్వర్తించిన ఆయన, సహచరులతో విభేదాల మూలంగా ఈ కేసు విచారణ చేయలేనని ముక్కుసూటిగా చెప్పేసి తప్పుకున్నారు. ఏపీ, మధ్యప్రదేశ్‌ లలో నక్సలైట్ల నియంత్రణకు కృషి చేసినందుకు 1990లో ఆయన ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు.

2014లో బీజేపీలో చేరిన ఆయన ఉత్తర ప్రదేశ్‌ లోని బాగ్‌ పత్‌ నుంచి అజిత్ సిగ్ పై విజయం సాధించి, ఎంపీగా ఎన్నికైన ఆయన హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులుగా సేవలందించి, రాజకీయ నాయకులుగా మారిన వీరిపైనున్న విశ్వాసంతో మోడీ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. వీరికి పదవులు అప్పగించడం ద్వారా కేంద్ర కేబినెట్ లో అవినీతి, పైరవీలకు స్థానం లేదని చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.