Narendra Modi Launches Hyderabad Metro Railభాగ్యనగర వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైల్ మొత్తానికి పట్టాలెక్కింది. ఎన్నో ప్రత్యేకతలు కలబోసుకున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం జాతికి అంకితమిచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మియాపూర్‌ చేరుకున్న ప్రధాని ముందుగా మెట్రో పైలాన్‌ ఆవిష్కరించి అనంతరం మెట్రోరైలును ప్రారంభించారు.

అనంతరం ప్రధాని ప్రాజెక్టుపై ఎల్అండ్ టీ ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ తిలకించారు. టీ-సవారీ యాప్‌, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రెండో అంతస్తులోని ప్లాట్‌ఫాంకు చేరుకుని మెట్రో రైలు ఎక్కారు. రైలులో ఆయన కూకట్‌పల్లి వరకు వెళ్లి తిరిగి మియాపూర్‌ చేరుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసిఆర్, మినిస్టర్ కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ – కిషన్ రెడ్డి తో పాటు కొందరు గవర్నమెంట్ మరియు ఎల్అండ్ టీ అధికారులు ఉన్నారు.

29న ఉదయం 6నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు మెట్రో రైలు ప్రయాణం ఉంటుందని గవర్నమెంట్ తెలిపింది. ఒక్కరోజులోనే 3000 స్మార్ట్‌కార్డుల కొనుగోలుతో మెట్రో కోసం ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పొచ్చు. మెట్రో చార్జీలు మినిమమ్ 10 రూపాయిలు మాక్సిమమ్ 60 రూపాయలుగా నిర్ణయించారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమాశ్రయంలో జరిగిన బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమవేశంలో తెలుగులో ప్రసంగం ప్రారంభించి సెన్సేషన్ సృష్టించారు. దాదాపుగా 2 నిముషాలపాటు ఆయన తెలుగులో ప్రసంగించారు. మెట్రో ప్రయాణం తరువాత ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హెచ్ఐసీసీకి చేరుకొని అక్కడ జరిగే జీఈసీ సమావేశంలో పాల్గొననున్నారు.