Jamili electionsపార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి, బిజెపి లేని ప్రాంతాలలో కూడా పార్టీని స్థాపించాలనుకున్న ప్రధాని నరేంద్ర ‘మోడీ అండ్ కో’ చేస్తోన్న రాజకీయ ఆలోచనలకు బ్రేక్ పడినట్లే. ఇప్పట్లో ‘జమిలి’ ఎన్నికల అవకాశం లేదని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఓపీ రావత్ తేల్చేసారు. దీంతో మోడీ ఆశలపై నీళ్ళు జల్లినట్లయ్యింది.

నిజానికి ‘జమిలి’ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, అందుకు లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అనుకూలంగా తీర్మానించాలని… ఒకవేళ ఇదంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినా… చట్ట సవరణ చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని చెప్తూ ‘జమిలి’ ఎన్నికలపై వస్తున్న వార్తలను ఖండించారు.

అలాగే ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను కూడా దాదాపుగా తోసిపుచ్చారు. ఏ సార్వత్రిక ఎన్నికలకు ముందైనా దాదాపుగా 14 నెలల ముందు నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తామని, అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని, తమ వద్ద ఉన్న సిబ్బంది 400 మాత్రమేనని, కానీ సార్వత్రిక ఎన్నికలకు కోటి మందికి పైగా అవసరమవుతారని పేర్కొంటూ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనలు కూడా పక్కకు నెట్టారు.