narendra modi Govt Decides to Revoke Article 370 in Jammu & Kashmirకేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను పరిష్కరించే దిశగా చారిత్రాత్మక అడుగు వేసింది. కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ ను ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 పేరిట చేర్చిన తాత్కాలిక నిబంధన ఇది. దీని ప్రకారం రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్‌ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది.

ఈ రాష్ట్రంలో ఇతర చట్టాల్ని అమలుచేయాలంటే రాష్ట్ర సమ్మతిని పార్లమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వం, ఆస్తిపై హక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు భూముల్ని కొనలేరు. అదే సమయంలో 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. ఈ రెండిటిని రద్దు చేశాకా జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ముకశ్మీర్‌ అవతరించాయి. లద్దాఖ్‌ ప్రాంతాన్ని అసెంబ్లీలేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.