Amit shah - narendra modi-మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా అంటే అవునని అంటున్నాయి కొన్ని వార్తలు. నవంబర్ తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దం కావాలని కేంద్రం ప్రభుత్వం ఎన్నిక ల కమిషన్ కు సూచించిందని కధనం. బిజెపి వ్యూహాత్మకంగా పది రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరిగేలా పావులు కదుపుతోందని చెబుతున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో వ్యతిరేక ఫలితాలు వస్తే దాని ప్రభావం ఆ తర్వాత జరిగే లోక్ సభ సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది కనుక,దానిని తప్పించుకునేందుకు ,అలాగే విపక్షాలు ఒక ఐక్య వేదిక మీదకు రావడానికి టైమ్ ఇవ్వకుండా ఉండేందుకు ఈ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

దీని ప్రకారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం అసెంబ్లీలతోపాటు ఆ తర్వాత 6 నుంచి 10 మాసాల లోపు గడువు మిగిలి ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా శాసనసభలకు కూడా ఎన్నికలు పార్లమెంట్ తో పాటు ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం.

ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 83, 85 (లోక్‌సభను గడువుకు ముందే రద్దు చేయడం), ఆర్టికల్‌ 172, 174 (రాష్ట్రాల శాసనసభల గడువును తగ్గించడం) డ్రాఫ్ట్‌ బిల్లులు ఇప్పటికే సిద్ధమయ్యాయని వార్తలు వస్తున్నాయి.