Narendra-Modi Government obstacle to polavaram projectఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వైఖరితో విసిగిపోయి ఉన్నారా? అంటే అవును అనే అంటున్నాయి చంద్రబాబుకు బాగా దగ్గరైనా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా. చంద్రబాబు తన అసంతృప్తిని చెప్పకనే చెప్తున్నారా అనేలా రెండు పత్రికలు ఈరోజు ప్రముఖంగా ప్రచురించాయి.

ఈనాడులో పోలవరం పరిణామాలపై కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రభుత్వం అసహనంగా ఉందని పేర్కొంటే ఆంద్రజ్యోతి ఒక అడుగు ముందుకు వేసి కేంద్రం ప్రాజెక్టుకు మోకాలడ్డుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించడం విశేషం. ప్రధానడ్యాంకు ఎగువన కాఫర్‌డ్యాం విడిగా నిర్మించాలా? లేదా అంతర్భాగంగానా? అనే విషయం తేల్చడానికి కేంద్ర జలవనరుల శాఖ కొత్త కమిటీని నియమించింది.

ఇప్పటికే ఆకృతుల ఖరారుకు కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో వారు నియమించిన కమిటీని కాదని కొత్త నిర్ణయం ప్రకటించడంలో కేంద్రం ఎలాగైనా ఆలస్యం చేద్దాం అనే వైఖరి బయటపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అదే విధంగా పునరావాసం, భూసేకరణ ఖర్చు విషయంలో కూడా కేంద్రం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది.

2013లో కేంద్రం భూసేకరణ చట్టం మార్చినందునే ఈ వ్యయం భారీగా పెరిగింది. అయితే పాత అంచనాల ప్రకారం భూసేకరణ, పునరావాసానికి రూ.మూడు వేల కోట్లే కేటాయింపులు ఉన్నందున ఆ మొత్తం తాము ఇచ్చేసినట్లేనని, పనులకు మాత్రమే బిల్లులు ఇస్తామని మళ్లీ చెబుతున్నారు. 2013లో కేంద్రం భూసేకరణ చట్టం మార్చినందునే ఈ వ్యయం భారీగా పెరిగింది.

2014 ఏప్రిల్‌1 నాటికి పునరావాసం ఖర్చే రూ.33 వేల కోట్లు. ఒకప్పుడు ఎకరాకు రూ.లక్షన్నర మాత్రమే పరిహారంగా చెల్లించారని, ఇప్పుడు ఏకంగా రూ.పదిన్నర లక్షలు ఎందుకు చెల్లిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2013 భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది కేంద్రమేనని, దాని అమలు బాధ్యత రాష్ట్రాలపై పడిందని చంద్రబాబు ఎంత చెబుతున్నా కేంద్రం వినిపించుకోవడం లేదు.

ఈ వైఖరితో చంద్రబాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా…పూటకో మెలిక పెడుతూ రాజకీయం పండించాలనుకుంటున్న కేంద్రానికి ఇండైరెక్ట్ సిగ్నల్ కావొచ్చు ఈ కధనాలు. మరి కేంద్రం వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి. ఒక్క పోలవరం కోసమే ఇప్పటి వరకూ ఓపిగ్గా ఉన్నారు చంద్రబాబు. అది కూడా కాదు అని తెలిసిన నాడు రాజకీయ పరిస్థితిలు ఎలా ఉండబోతాయో మరి!