Narendra Modi gets emotional as he pays last respects to Sushma Swarajచిన్నమ్మ సుష్మాస్వరాజ్ ఇక లేరు. నిన్న రాత్రి ఆమె ఉన్నఫళంగా గుండెపోటుకు గురై అస్తమించారు. ఆమెను హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించినా డాక్టర్స్ ఏమీ చెయ్యలేకపోయారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. దీనితో దేశమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ ఉదయం సుష్మ నివాసానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు. ఆమె భర్త కౌశల్‌ స్వరాజ్‌, కుమార్తెను ఓదార్చారు. ఆ సందర్భంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ భర్తను పరామర్శిస్తుండగా ఆయన కళ్లు చెమర్చాయి.

ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. ఆమెను కడసారి చూడటానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ కూడా వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ కుమార్తె బన్సూరిని ఓదార్చుతూ ఆడ్వాణీ కుమార్తె ప్రతిభ కన్నీటిపర్యంతమయ్యారు. కాసేపట్లో ఆమె పార్థీవదేహాన్ని బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు తరలిస్తారు.

ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దాదాపుగా 41 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తరువాత అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. మొన్న ఆ మధ్య ఆమె ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా కూడా వస్తారని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ గతంలో రెండు పర్యాయాలు గవర్నర్ గా పని చేశారు.