Narendra Modi - Fani Cyclone ఒడిశా, ఉత్తరాంధ్రను వణికించిన ఫొని తుపాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు కరిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు ఈ సారి కేంద్రం ముందస్తు సాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ కు 200 కోట్ల మేర సాయం అందింది. ఎన్నికలలో లబ్ది కోసం అని కొందరు అన్నా డబ్బులైతే వచ్చాయి. మరోవైపు ఎన్నికల సంఘం ద్వారా కోడ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో పాలన కుంటుపడేలా చేసిన మోడీ ఆ దిశగా కూడా తుఫానును దృష్టిలో పెట్టుకుని తన కక్ష సాధింపుకు కొంత మినహాయింపు ఇచ్చారు.

ఏపీలో నాలుగు జిల్లాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను సడలించింది. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ మినహాయింపు ఇచ్చింది. ఫొని తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు ముమ్మరంగా సాగించేందుకు వీలుగా కోడ్‌ను సడలించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. అయితే కోడ్‌ మినహాయింపు ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే వివరాలు ఈసీ పేర్కొనలేదు.

ఇప్పటికే ఫొని తుపాను నేపథ్యంలో ఒడిశాలో కోడ్‌ను సడలించిన సంగతి తెలిసిందే. అక్కడ సడలించి ఇక్కడ సడలించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ కు కూడా ఈ మినహాయింపు ఇచ్చారు. మొత్తానికి కారణం ఏదైతేనేమి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన కక్షసాధింపుకు కొంత బ్రేక్ ఇచ్చారు. ప్రధాని మనసు కరగడానికి తుఫాను రావాల్సి వచ్చింది. ఫొని తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో ఎక్కువగా ఉంది.