Narendra Modi flags off Delhi-Shimla UDAN flightభారతావనిలో దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా విమానాలు ఎక్కే రోజులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఢిల్లీ నుంచి షిమ్లాకు కేవలం 2,500 టికెట్ ధరపై తొలి ‘ఉడాన్’ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) విమానాన్ని ప్రారంభించిన నేపధ్యంలో కీలక వ్యాఖ్యలు చేసారు. హవాయి చెప్పులు ధరించేవారు కూడా హవా (గాల్లో)లో ప్రయాణించవచ్చని అన్నారు. రీజనల్ కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించామని, ప్రపంచంలోనే ఈ తరహా విధానం ప్రప్రథమమని అన్నారు.

గత సంవత్సరం జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానంలో భాగంగా గంట ప్రయాణం లేదా 500 కిలోమీటర్ల దూరానికి 2,500 టికెట్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ భారతావనిలో 24 ఎయిర్ పోర్టులు, ఉత్తరాదిన 17, దక్షిణాదిన 11, తూర్పు ప్రాంతాన 12, ఈశాన్యాన 6 విమానాశ్రయాల నుంచి లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సేవలు నడుస్తాయని అధికారులు తెలిపారు. కేంద్రం పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణా ప్రభుత్వం కూడా ఓ సరికొత్త పధకంతో ప్రజల ముందుకు వచ్చింది.

హైదరాబాద్ నుంచి తిరుమలకు విమానంలో తీసుకెళ్లి, అక్కడ గంట వ్యవధిలో దర్శనం చేయించి, చుట్టు పక్కల దేవాలయాలను చూపించి, తిరిగి రాత్రికి హైదరాబాద్ చేర్చేలా తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వేసవిలో పర్యాటకాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్న టూరిజం శాఖ 10 వేలతో ఒక రోజు, 13 వేలతో రెండు రోజుల ప్యాకేజీలను ప్రకటించింది. ప్రయాణం, దర్శనం, భోజనం, వసతి అన్నీ ఈ ధరలో ఇమిడి ఉంటాయి.

ఒక రోజు యాత్రలో భాగంగా ఉదయం 6:55కు విమానంలో బయలుదేరి 8:10కి రేణిగుంటకు, అక్కడి నుంచి 9:30కు తిరుమల చేరుకునే యాత్రికులకు, ఉదయం 12:30 గంటల్లోపు దర్శనం, 3 గంటల వరకూ భోజనం, విశ్రాంతి, ఆపై తిరుచానూరు అమ్మవారి దర్శనం, సాయంత్రం 5:35 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి, రాత్రి 7:45కు హైదరాబాద్ చేర్చేలా ప్యాకేజీ ఉంటుంది.

రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా, తొలుత శ్రీకాళహస్తి, ఆపై భోజన విరామం, సాయంత్రం కాణిపాకం లేదా తిరుచానూరు, రాత్రికి ఫార్చ్యూన్ కేన్సస్ లో బస, మరుసటి రోజు తిరుమల శ్రీవారి దర్శనం, ఆపై విశ్రాంతి, సాయంత్రం తిరుచానూరు అమ్మవారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణం ఉంటాయి. ఇక ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి పర్యటనకు వెళ్లాలనుకునే వారు టీఎస్‌ టీడీసీ సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయాల్లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.