Narendra Modi Dual Tongueకొద్ది నెలల క్రితం పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోడీ మాట్లాడుతూ విభజనానంతరం పరిణితితో కేసీఆర్ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారని, చంద్రబాబుకు అది లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు దానిని ఒక ఎన్నికల అస్త్రంగా వాడుకుంటారు. ఒకరకంగా ప్రధాని వేరే పార్టీ ముఖ్యమంత్రిని పొగడటం గొప్ప విషయమే. అయితే ఈరోజు ఎన్నికల ప్రచారానికి నిజామాబాదు వచ్చిన మోడీ మాట మార్చారు. గతంలో చెప్పిన మాటలన్నీ మర్చిపోయి కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ లాగా అభివృద్ధి చెయ్యకుండా అధికారంలో ఉందామంటే కష్టమని కేసీఆర్ మరో ఐదు సంవత్సరాలు రెస్టు తీసుకోకతప్పదని మోడీ అన్నారు. ఇంటికీ నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ ను లండన్ చేస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ వచ్చే అయిదు సంవత్సరాలు లండన్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందే అన్నారు. ఒకరకంగా ముందే శాసనసభను రద్దు చెయ్యడం మంచిదే. ప్రజలు ఆరు నెలల ముందే విముక్తి పొందారు అని మోడీ అన్నారు.

ఏడాది తిరగకుండా కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు అభిప్రాయం మార్చుకున్నట్టు? పార్లమెంట్ సాక్షిగా మోడీ అబద్ధం చెప్పారా? లేక ఇప్పుడు అబద్దం చెబుతున్నారా? ప్రధాని స్థాయికి ఇటువంటి మాటలు తగునా? అయితే విశ్లేషకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రజకూటమి వైపు వెళ్లకుండా మోడీ తెలివిగా మాట్లాడుతున్నారని అంటున్నారు. తద్వారా అధికార ప్రక్షానికే కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక తాటి మీదకు తెచ్చిన విషయం తెలిసిందే.