Narendra Modi Demonetization నోట్ల ర‌ద్దు విష‌యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ అంచ‌నాలు గల్లంత‌య్యాయా? వేసిన లెక్కలు పక్కదారి పట్టాయా? నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వానికి భారీ భంగ‌పాటు త‌ప్ప‌దా? అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌భుత్వ అంచ‌నాల ప్రకారం ఖ‌జానాకు 4 నుండి 5 లక్షల కోట్ల లాభం వస్తుందని భావిస్తే… ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తే ఆ అవకాశాలు లేవ‌ని తేల్చేస్తున్నారు. నోట్ల రద్దుకు ముందు దేశంలో 1716.5 కోట్ల 500 రూపాయ‌ల నోట్లు, 685.8 కోట్ల 1000 నోట్లు చ‌లామ‌ణిలో ఉన్నాయి… ఈ రెండింటి విలువ 15.44 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు.

అయితే ఇందులో ఒక్క 500 రూపాయల నోట్ల విలువ 8.58 ల‌క్ష‌ల కోట్లు కాగా, 1000 రూపాయల నోట్ల విలువ 6.86 ల‌క్ష‌ల కోట్లు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిసెంబ‌రు మాసాంతానికి సుమారు 11 ల‌క్ష‌ల కోట్ల విలువైన ర‌ద్ద‌యిన క‌రెన్సీ డిపాజిట్ అవుతుంద‌ని, మిగిలిన నాలుగైదు లక్షల కోట్లు బ్లాక్ మ‌నీగా మారిపోతుందని ప్ర‌భుత్వం భావించింది. డిపాజిట్ కాని క‌రెన్సీ ఆర్‌బీఐకి మిగిలిన‌ట్టే. అయితే న‌వంబ‌రు 27వ తేదీ వర‌కు బ్యాంకుల్లో 8.45 ల‌క్ష‌ల కోట్ల విలువైన పాత‌ నోట్లు డిపాజిట్ కాగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 10 ల‌క్ష‌ల కోట్లు చేరుకుంటుందని అంచ‌నా.

ఇదిలా ఉంటే… ప్ర‌తి బ్యాంకు న‌గ‌దు నిల్వ‌ల నిష్ప‌త్తి (సీఆర్ఆర్‌) కింద వ‌సూలైన డిపాజిట్ల‌లో కొంత మొత్తాన్ని ఆర్బీఐ ద‌గ్గ‌ర ఉంచాలి. నోట్ల రద్దు నాటికి అంటే న‌వంబ‌రు 8వ తేదీ నాటికి సీఆర్ఆర్ నిధుల మొత్తం విలువ 4.06 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు. దీంతో పాటు బ్యాంకుల దగ్గ‌ర నవంబ‌రు 8 నాటికి ఆ మొత్తం 70 వేల‌ కోట్లు. ఈ లెక్క‌న బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సొమ్ము, సీఆర్ఆర్ కింద ఆర్బీఐలో ఉన్న సొమ్మును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు 14 ల‌క్ష‌ల కోట్లు పైనే వచ్చినట్లు లెక్కించవచ్చు.

అంటే ఇంకా చ‌లామ‌ణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ‌లో మార్కెట్లో మిగిలింది కేవ‌లం మ‌రో ఒక ల‌క్ష‌ కోట్లు మాత్రమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాత నోట్లు జ‌మ‌చేయ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. ఈ నెలాఖ‌రుకు ఎంత మొత్తం జ‌మ అవుతుంద‌నే చ‌ర్చ ఇప్పుడు మొదలైంది. ఇది క‌నుక మ‌రో ల‌క్ష కోట్ల‌కు చేరితే మోడీ ల‌క్ష్యం ఆవిరి అయినట్లే భావించవచ్చు. అంటే నోట్ల ర‌ద్దుతో ఆశించిన ప్ర‌యోజ‌నం క‌లుగ‌క‌పోగా, ప్ర‌జ‌లు మాత్రం అష్ట‌క‌ష్టాలు అనుభ‌వించిన‌ట్టే అవుతుంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ‘బ్లాక్’ రూపంలో ఉన్నదంతా ‘వైట్’గా తర్జమా అయినట్లే భావించాల్సి వస్తుంది.