demonetization-to-backfire-on-modiనోట్ల రద్దుపై తాను చాలా కాలంగా రీసెర్చ్ చేశానని, ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఈ నిర్ణయం విఫలమైతే తనను మాత్రమే ప్రజలు తిట్టుకోవాలని, బీజేపీ నేతలు, పార్టీ, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ ఉండరాదని మోడీ కేంద్ర మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తాను అత్యంత నమ్మకంగా ఏరి, కోరి ఎంచుకున్న హస్ముక్ అధియా, మరో ఐదురుగు మొత్తం నోట్ల రద్దును పర్యవేక్షిస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా ప్రధాని నివాసంలోని రెండు గదుల్లో నుంచి ఈ పని మొదలు పెట్టినట్టు ఇప్పుడు తెలుస్తోంది.

2014లో అధికారంలోకి వచ్చిన తరువాత సంస్కరణల అమలును వేగవంతం చేసిన మోడీ, నోట్ల రద్దు నిర్ణయం దేశాభివృద్ధిలో అతి పెద్ద మలుపు కాగలదని ముందే భావించారట! ఇదే విషయాన్ని నవంబర్ 8 నాటి క్యాబినెట్ భేటీలో మోదీ వెల్లడిస్తూ, “నా రీసెర్చ్ అంతా పూర్తయింది. ఇది విఫలమైతే నన్నొక్కడినే విమర్శించాలి” అని మోడీ వెల్లడించినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న ముగ్గురు మంత్రులు పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోడీ విధులు నిర్వహిస్తున్న రోజుల్లో 2003 నుంచి 2006 వరకూ మోడీ వద్ద ప్రధాన కార్యదర్శిగా హస్ముఖ్ విధులు నిర్వహించగా, అప్పటి నుంచే ఆయనపై మోడీ ఎంతో నమ్మకం పెట్టుకున్నారని తెలుస్తోంది.

మోడీకి నమ్మకమైన నేతగా నిలిచిన హస్ముక్, అంతకుముందే ఆయనకు యోగాను పరిచయం చేసి మనసుకు కూడా దగ్గరయ్యారట. ఇక మోడీతో డైరెక్టుగా ఫోన్లో మాట్లాడగలిగే కొద్ది మంది ప్రభుత్వ అధికారుల్లో హస్ముఖ్ కూడా ఒకరు. సెప్టెంబర్ 2015 నుంచి రెవెన్యూ శాఖలో కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆయన, రోజూ అరుణ్ జైట్లీకి రిపోర్టు చేస్తుంటారు. మొత్తానికి బ్యాంకులలోకి వస్తున్న కరెన్సీ కట్టలతో ఇప్పటికే 12 లక్షల కోట్లు దాటడంతో మోడీ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీని అప్రతిష్ట పాలు చేయకుండా, కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఆ ప్రభావం పడేలా మోడీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.