Narendra-Modi on AP and TSపార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై టీఆర్ఎస్ వర్గాలైతే తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే మోడీపై సంచలన విమర్శలు కేసీఆర్ చేయగా, సోషల్ మీడియాలో కేటీఆర్ తగులుకున్నారు.

తాజా వివాదంతో కేశవరావు వంటి ముఖ్య నేతలు మరో అడుగు ముందుకేసి, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ను మంట కలిపేలా మోడీ మాట్లాడారని విమర్శిస్తూ, ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంపై న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నామని, ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణను అగౌరవ పరచడమేనని అన్నారు.

టీఆర్ఎస్ వాదన పక్కన పెడితే, అసలు ఉన్నట్లుండి నరేంద్ర మోడీ ఏపీ – టీఎస్ విభజన ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చినట్లు? విభజన ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్థానం సంపాదించుకోవడం కోసమా? లేక తెలంగాణ సర్కార్ కు త్వరలో శుభంకార్డు వేసేందుకా?

ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ కాస్త బలంగా ఉన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీగా కొనసాగుతోన్న బీజేపీ, కేసీఆర్ ను కార్నర్ చేయడానికే ఉన్నట్లుండి నాటి విభజన తీరును ఎత్తినట్లుగా కనపడుతోంది. ప్రధాని హైదరాబాద్ వచ్చి వెళ్లిన రెండు రోజులకే ఈ ప్రకటన చేయడం మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది.

మోడీ హైదరాబాద్ విచ్చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్వాగతం పలకకుండా, మంత్రుల చేత స్వాగత సత్కారాలు అందజేసిన వైనం మీడియా వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. ఇది జరిగిన కొద్ది గంటలకే టీఆర్ఎస్ నేతలు మరింత మండిపడేలా చేయడంలో మోడీ విజయవంతం అయ్యారు.

అంటే టీఆర్ఎస్ తో ప్రత్యక్ష యుద్ధానికి మోడీ తెరలేపినట్లయ్యింది. టీఆర్ఎస్ నేతలు ఎంత బలంగా విమర్శలు చేయగలిగితే, బీజేపీ అంత బలంగా ప్రజల చర్చలలో నానుతుంది. మరో ఏడాదిన్నర్ర సమయంలో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, తెలంగాణ సర్కార్ కు ప్రత్యామ్నాయం ఒక్క బీజేపీ మాత్రమే అన్న నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇదొక ‘పునాదిరాయి’గా కనపడుతోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే… బీజేపీ పార్టీ పరిస్థితి ఇక్కడ శూన్యం. అయితే రాబోయే రోజుల్లో ఎంతో కొంత బలపడేందుకో, ప్రజా విశ్వాసం పెంపొందించేందుకో ఈ ప్రకటన ఉపయోగపడొచ్చు. ప్రస్తుతం 1% ఉన్న ఏపీలో దీని నుండి ఎంతవచ్చినా ఆ పార్టీకి బలమే అవుతుంది గనుక, ఈ ప్రకటన ఏపీలో నష్టం అయితే చేకూర్చదు. అలా ఒక దెబ్బకు రెండు పిట్టల మాదిరి మోడీ ప్రకటన ఉందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే… ఈ విభజనలో బీజేపీ కూడా ఓ భాగస్వామి అన్న విషయం తెలిసిందే. అలాగే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ సర్కార్ ఏ విధంగా సహకరించిందో కూడా బహిరంగ సత్యమే. ఏపీపై నిజంగా అంత ప్రేమ ఉంటే రాజధాని లేని రాష్టంగా ఉంచేవారా? జాతీయ హోదా దక్కిన పోలవరం పూర్తి కాకుండా ఉంటుందా?