Narendra-Modi_Chandrababu-Naidu_YS-Jagan_G2-0Indiaప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఢిల్లీ, రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈసారి జీ-20 సదస్సుకి భారత్‌లో నిర్వహించబోతుండటంతో దానిలో చర్చించాల్సిన అంశాలపై దేశంలో ప్రధాన ప్రతిపక్షాల సూచనలు, సలహాలు తీసుకొనేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అదేవిదంగా బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్‌, వామపక్షాలతో సహా పలు పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ అందరం కలిసికట్టుగా సాగాలని, భారత్‌లో ఈ సదస్సు నిర్వహణ వలన చిన్న నగరాలు, పట్టణాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అన్నారు. జీ20 సదస్సుకి భారత్‌ ఈసారి అధ్యక్షత వహించడం యావత్ దేశానికి గర్వకారణమని అన్నారు. అందరం కలిసి ఈ సదస్సుని విజయవంతం చేద్దామని విజ్ఞప్తి చేశారు.

నిజమే జీ20 భారత్‌ అధ్యక్షత వహించడం, సదస్సు నిర్వహించడం హర్షించదగ్గ విషయాలే. ఈ సదస్సులో చర్చించాల్సిన అంశాలపై ప్రధాన ప్రతిపక్షాల సూచనలు, సలహాలు తీసుకోవడం చాలా అభినందనీయమే.

ఇటువంటి ఫెడరల్ స్పూర్తినే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల కూడా చూపాలని దేశంలో అన్ని రాష్ట్రాలు కోరుకొంటున్నాయి. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాలను కూల్చేందుకు మోడీ ప్రభుత్వం ఓ పక్క విశ్వప్రయత్నాలు చేస్తూ, తమ కుట్రలను, కుతంత్రాలను పట్టించుకోకుండా అన్ని పార్టీలను కలిసి పనిచేద్దామని కోరడం చాలా విడ్డూరంగా ఉంది.

నిన్న జరిగిన ఈ సమావేశంలో ఐక్యతా రాగాన్ని ఆలపించి, మరోపక్క ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయాలనుకోవడాన్ని ఏమనుకోవాలి? దేశంలో అన్ని రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకోవడం తప్పు కాదు. అందుకోసం ఎన్నికలలో పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయాలి కానీ ప్రభుత్వాలని కూల్చివేయాలనుకోవడమే తప్పు. ఒక్కో రాష్ట్రాన్ని జయిస్తాం… బిజెపి జెండా ఎగురవేస్తాం.. అని బిజెపి నేతలు చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి? అన్ని రాష్ట్రాలను జయించి బిజెపి జెండాలు ఎగురవేయడానికి రాష్ట్రాలు ఏమైనా శత్రుదేశాలా?

కేంద్ర ప్రభుత్వం అందమైన నినాదాలలో ‘సబ్ కే సాత్… సబ్ కే వికాస్’ (అందరూ కలిసికట్టుగా అందరి అభివృద్ధి కోసం) కూడా ఒకటి. కానీ నేటికీ అభివృద్ధి, నిధుల కేటాయింపు, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దాని దయాదాక్షిణ్యాల కోసం ప్రాధేయపడవలసి వస్తోంది. ఎందుకు?

అలాగని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గొప్ప నీతినిజాయతీ కలిగినవని చెప్పలేము. కానీ దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాలను పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఏ రాష్ట్రమైన గాడి తప్పినా, వెనుకబడిపోతున్నా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత కూడా ఉంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, పోలవరం ప్రాజెక్టుల పరిస్థితి అయోమయంగా మారినందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రెండు సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. కానీ ఏపీలో రాజకీయాలపై చూపుతున్న శ్రద్ధ ఈ సమస్యల పరిష్కారంపై చూపడంలేదని అందరికీ తెలుసు. కనుక ప్రధాని మోడీ మాటలకి, చేతలకి చాలా తేడా కనిపిస్తోందని చెప్పక తప్పదు.