Narendra-Modi-Chandrababu-Naidu-BJP-TDP-తెలంగాణలో దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపికి మునుగోడు ఉపఎన్నికలలో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఈ ఉపఎన్నికలు బిజెపికి అనేక కొత్త పాఠాలు నేర్పాయి కనుక ఈ ఓటమి కూడా మంచిదే అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో బిజెపి విజయం సాధించి ఉంటే గుడ్డిగా ముందుకు వెళ్ళి శాసనసభ ఎన్నికలలో బోర్లా పడి ఉండేది. కనుక ఈ ఓటమితో ఆత్మవిమర్శ చేసుకొనే అవకాశం బిజెపికి లభించిందనే చెప్పవచ్చు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి బలం వలన కాకుండా ఈటల రాజేందర్‌, రఘునందన్ రావుల సొంత బలంతోనే విజయం సాధించి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వలన రెండో స్థానంలో నిలువగలిగిందని అందరికీ తెలుసు. కనుక బిజెపిలో అటువంటి బలమైన నేతలు ఎంతమంది ఉన్నారు? లేకుంటే శాసనసభ ఎన్నికలలో బిజెపి ఏవిదంగా గెలవగలదు?అనే ప్రశ్న సర్వత్రా వినిపించింది.

తెలంగాణ బిజెపిలో బలమైన అభ్యర్ధులు లేరనే విషయం బిజెపికి కూడా బాగా తెలుసు కనుకనే ‘చేరికల కమిటీ’ని ఏర్పాటు చేసుకొని టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలలో నుంచి నేతలను బిజెపిలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.1800 కోట్లు విలువగల కాంట్రాక్ట్ ఇచ్చి బిజెపిలో చేర్చుకొంది. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పుకొన్నారు కూడా. ఇక నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.250 కోట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి భంగపడింది. అది వేరే విషయం కానీ ఆవిదంగా కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం అయ్యింది.

అయినప్పటికీ తెలంగాణలో కమలం వికసించాలంటే ఈ ప్రయత్నాలు సరిపోవని బిజెపికి కూడా తెలుసు. కనుక టిడిపి సహకారం కూడా ఆశిస్తోందని బహుశః అందుకే తెలంగాణ టిడిపికి బీసీ నేతగా మంచి గుర్తింపు కలిగిన కాసాని జ్ఞానేశ్వర్ గౌడ్‌ నియామకం జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికలలో టిడిపి పరోక్షంగా బిజెపికి సహకరించిందని టిఆర్ఎస్‌ మంత్రులు ఆరోపించడం చూస్తే ఈ ఊహాగానాలలో ఎంతో కొంత నిజముందనే అనిపిస్తుంది.

ఒకవేళ బిజెపి తెలంగాణలో టిడిపి సహకారం కోరడం నిజమైతే, అందుకు ప్రతిగా ఏపీలో టిడిపికి కేంద్రం సహకరించాలని ఆశించడం తప్పు, అత్యాశ కాదు. కానీ ఏపీలో టిడిపితో పొత్తులు పెట్టుకోబోమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్‌ సునీల్ థియోరర్ ఇటీవలే ప్రకటించారు. కనుక ఏపీలో పొత్తులపై స్పష్ఠత వస్తే తప్ప తెలంగాణలో కూడా స్పష్టత రాకపోవచ్చు.