Narendra Modi Chandra Babu Naidu meeting at Azadi ka Amritotsav    ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృతోత్సవ్‌ సన్నాహక కమిటీ సమావేశానికి చంద్రబాబు నాయుడుని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలుపుకి టిడిపి-బిజెపిలు విడిపోవడం కూడా ఓ కారణమని అందరికీ తెలుసు. కనుక ఆ రెండు పార్టీలు ఎప్పటికీ దూరంగా ఉండాలని వైసీపీ కోరుకోవడం సహజమే.

ఆ రెండూ దూరం అవడంతో ఈ మూడేళ్ళలో వైసీపీ బిజెపికి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఆ ప్రయత్నంలో కొంతమేరకు సఫలమైంది కూడా. అందుకే మూడేళ్ళుగా లక్షల కోట్లు అప్పులు లభిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కేంద్రం సహకరించకపోతే ఒక్క రోజుకూడా ప్రభుత్వం నడవలేని దయనీయ ఆర్ధిక పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కనుక వైసీపీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు చాలా అవసరం. ఒకవేళ టిడిపి-బిజెపిలు మళ్ళీ చేతులు కలిపితే, ఆ ఆశలు అడియాసలవుతాయి. కనుక టిడిపి-బిజెపిలు ఎప్పటికీ దూరంగా ఉండాలని కోరుకోవడం వాటి మద్య దూరం పెంచేందుకు ప్రయత్నించడం సహజమే.

ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడం, ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడుని ఆప్యాయంగా పలకరించడం, వారిరువురు కాసేపు కబుర్లు చెప్పుకోవడం వైసీపీ జీర్ణించుకోవడం కష్టమే.

చాలా ఏళ్ళ తర్వాత వారిరువురూ ముఖాముఖీ ఎదురుపడి పలకరించుకొన్నందున సహజంగానే మీడియా ఆ వార్తను హైలైట్ చేసింది. కాస్త అత్యుత్సాహంతో వారి భేటీ గురించి నాలుగు ముక్కలు ఎక్కువ చెప్పి ఉండవచ్చు. వైసీపీకి ఈ వార్తలు పుండు మీద కారం చల్లినట్లవుతుందని వేరే చెప్పక్కరలేదు.

ఆ కడుపు మంట జగన్ ఆత్మసాక్షిలో కనబడింది. ‘మోడీకి చంద్రబాబు సరండర్ అయిపోయినట్లేనా?’ అంటూ నిన్నటి ఆన్‌లైన్‌ సంచికలో ఆత్మసాక్షి భగభగ మండిపోతూ అక్కసు వెళ్ళగక్కింది. రాజకీయాలలో శాస్విత శత్రువులు, శాస్విత మిత్రులు ఉండరనే ప్రాధమిక సూత్రాన్ని మరిచిపోయి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీని కలవడం, ఆయనతో మాట్లాడటం చాలా నేరమన్నట్లు తేల్చి చెప్పేసింది. చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీకి సరండర్ అయిపోయి తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసినట్లే అని తీర్మానం చేసేసింది.

అయితే వైసీపీకి బిజెపికి ఎటువంటి పొత్తులు లేనప్పటికీ మరి మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వం చేస్తున్నది అదే కదా? అప్పులు, కేసుల విముక్తి కోసం ప్రధాని నరేంద్రమోడీకి సరండర్ అయిపోలేదా?తమకు 23 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదాను సాధిస్తామని గొప్పలు చెప్పుకొన్నా వైసీపీ ఇప్పుడు నంగి నంగిగా మాట్లాడటం లేదా?పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే చేతులు నలుపుకొంటూ ప్రాధేయపడుతున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులతో చెప్పారు కదా?ఇది సరండర్ అయిపోవడం కాదా?

అయినా ఏ రాజకీయ పార్టీ ఎల్లప్పడూ ఒకేలా వ్యవహరించదని, మారుతున్న కాలాన్ని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు, విధానాలు మార్చుకొంటుందని, అది చాలా సహజమని ఇదే ఆత్మసాక్షి ఇదివరకు చెప్పింది. కనుక టిడిపి-బిజెపిలు తమ సంబందాలపై పునరాలోచించుకొంటే వైసీపీకి… దాని ఆత్మసాక్షికి ఎందుకు కడుపు మంట?

అయినా తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు తమకే వచ్చేస్తాయని, మరో 30 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని వైసీపీ గట్టిగా నమ్ముతున్నప్పుడు ఇక ఏ పార్టీ దేనితో పొత్తులు పెట్టుకొంటే భయం ఎందుకు?అంటే అదంతా మేకపోతు గాంభీర్యమే అనుకోవాలా?