narendra modi behaving like nero emperor నాలుగు రోజుల క్రితం పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాల దాడులను దేశవ్యాప్తంగా స్వాగతించారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు మాత్రం విస్తు గొలుపుతున్నాయి. వాయుసేన పైలట్ అభినందన్ పాకిస్తాన్ చెరలో బందీ అయ్యాక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు. ఇప్పటిదాకా అభినందన్ గురించి ప్రధాని ఒక ట్వీట్ కూడా చెయ్యలేదు. దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించనూ లేదు.

ఆయన ఏమీ జరగలేదు అన్నట్టు రాజకీయ కార్యక్రమాలలో బిజీగా ఉంటున్నారు. ఈరోజు అయితే ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న బూత్ కమిటీలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించుకుంటూ కూర్చున్న తీరుగా ఉంది మోడీ ప్రవర్తన అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సమర్ధకులు మాత్రం పాకిస్తాన్ కు భయపడి అన్ని పనులూ మానుకుని ఇంట్లో కూర్చుంటామా అంటూ కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

పాలనకు సంబంధించిన పనులు చేస్తే ఎవరూ తప్పు పట్టరు అయితే ఇటువంటి సమయంలో రాజకీయాలు చెయ్యడమే ఎవరూ హర్షించరు. ఇదే పని ప్రతిపక్ష పార్టీలు చేస్తే ఈ పాటికి చీల్చి చెండాడేవారు. బహుశా మోడీ మీద మనకు ఉన్న మితిమీరిన అంచనాల వల్ల ఇది తప్పుగా అనిపించవచ్చు. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా పైగా ఎన్నికలలో విజయాల కోసం ఏమైనా చేసే చెయ్యగలిగే రాజకీయనాయకుడిగా మోడీ – షాలకు పేరు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన పూర్తిగా అసందర్భం, అసహజం మాత్రం కాదు.