narendra modi attitude regarding special package“విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరాన్ని అమలు చేసి చూపిస్తాం…” _ ప్రధాని నరేంద్ర మోడీ.
“ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజ్ మెరుగు… ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం…” _ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.
“ప్రత్యేక హోదా అంశం ‘నీతి అయోగ్’ పరిశీలనలో ఉంది…” _ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు.

ఏపీకి సంబంధించిన “ప్రత్యేక హోదా”పై ఢిల్లీ ‘ప్రముఖులు’ వివిధ సందర్భాలలో ప్రస్తావించిన వ్యాఖ్యలివి. ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా పరోక్షంగా “ప్రత్యేక హోదా” హుష్ కాకి అన్న ‘సందేశాన్ని’ అంతర్లీనంగా పంపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర సర్కారే కాదు, ఏపీ ప్రజానీకం కూడా ‘స్పెషల్ స్టేటస్’పై ఆశలు వదిలేసుకున్నారు. మానవ ప్రయత్నాలుగా చంద్రబాబు సర్కార్ తో పాటు కారెం శివాజీ, సినీ నటుడు శివాజీ వంటి ఔత్సాహికులు మోడీ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే దిశగా కార్యాచరణ చేస్తున్నారు తప్ప, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అల్లంత దూరాన’ ఉందన్న సంగతి ఖరారయ్యింది.

ఇలాంటి సందర్భంలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, ప్రత్యేక హోదా ద్వారా ‘రాజకీయ లబ్ధి’ పొందేందుకు ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా తన ఎంపీలను బరిలోకి దింపాలని నిర్ణయించి, ఓ బహిరంగ ప్రకటన కూడా చేసింది. అలాగే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు దేశం ఎంపీలు కూడా ‘ప్రత్యేక హోదా’ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహరచన గావించారు.

దీంతో ఏమనుకుందో ఏమో గానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంట్ వేదికగా ‘ప్రత్యేక హోదా’కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో ఆర్ధిక లోటులో ఉన్న ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాల్సి ఉందని, ఏపీతో పాటు పంజాబ్ వంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను అడగడం సమంజసం కాదని, ఏపీకి “ప్రత్యేక హోదా” యొక్క ఆవశ్యకత ఏమిటో క్లుప్తంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు.

పార్లమెంట్ వేదికగా ‘రచ్చ’ చేయాలని భావించిన ప్రతిపక్షాల దూకుడును అడ్డుకునేందుకు మాత్రమే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా ‘నీతి అయోగ్’ మాటను ప్రస్తావించడం ద్వారా, కేంద్రం తన రెండు నాల్కల ధోరణిని బయట పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తలుచుకుంటే ‘ప్రత్యేక హోదా’ ఇవ్వడం ‘అర సెకన్’ పని అన్న సినీ నటుడు శివాజీ మాటలు ఈ సందర్భంగా గుర్తుకు రాక మానవు.