narendra modi approves vaccination for 15 to 18 years oldశనివారం రాత్రి 9.30 నిముషాలకు మరికొద్దిసేపట్లో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని పీఎంఓ ఓ సమాచారం ఇవ్వగానే ప్రజలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏ అంశంపై ప్రధాని ప్రసంగం ఉండబోతోందా? అన్న కోణంలో నెటిజన్లు అయితే వివిధ రకాల భావాలతో కావాల్సినంత వినోదాన్ని పంచుకున్నారు.

2 వేల రూపాయలు నోటు రద్దని కొందరు, లేదు లేదు శనివారం రాత్రి గనుక ఈ నైట్ నుండి మళ్ళీ లాక్ డౌన్ ప్రకటన ఉంటుంది, కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోండి అని ఇంకొందరు… ఇలా ప్రధాని గత ప్రసంగాలను గుర్తు చేసుకుంటూ ఉన్న తరుణంలో మోడీ లైవ్ లోకి రానే వచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ భారీ స్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఓ సారి అలర్ట్ చేయడానికి మోడీ వచ్చారన్న విషయం తేలింది. ప్రజలందరూ మాస్క్ లను, శానిటైజర్ లను వినియోగించాలని ఇందులో ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దని పిలుపునిచ్చారు.

అలాగే పిల్లలకు కావాల్సిన బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, జనవరి 3 నుండి 15-18 ఏళ్ళ వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే దేశంలో 61% మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, మనదేశం అందరికంటే సమర్ధంగా కరోనాను ఎదుర్కొందని అన్నారు.

జనవరి 10వ తేదీ నుండి దేశంలో ఉన్న హెల్త్ వర్కర్లకు మరియు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తున్నట్లుగా తెలిపారు. చాలాకాలం తర్వాత కరోనా గురించి ప్రధాని మాట్లాడడంతో, ఓమిక్రాన్ రూపాన్ని తేలికగా తీసుకోకూడదన్న సందేశాన్ని మోడీ దేశ ప్రజలకు ఇచ్చినట్లయింది.